/rtv/media/media_files/2026/06/08/youtuber-2026-06-08-19-26-42.jpg)
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైకుల కోసం తమ ఇళ్లు, నగలు, లగ్జరీ లైఫ్‌ను చూపించే వారికి కనువిప్పు కలిగించే ఘోర సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలో జరిగింది. ఒక మహిళా యూట్యూబర్ తన ఇంట్లోని బంగారం, డబ్బును చూపిస్తూ వీడియోలు చేయడమే ఆమె కొంపముంచింది. ఆ వీడియోలు చూసి స్కెచ్ వేసిన దొంగలు.. ఆమె ఇంట్లోనే పడి దాదాపు రూ.10 లక్షల విలువైన సామాగ్రిని దోచుకెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని మోహని గ్రామానికి చెందిన రచన గుర్జర్ అనే గృహిణి ఒక యూట్యూబర్. ఆమెకు సోషల్ మీడియాలో ఒక లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో కొందరు ముసుగు దొంగలు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు.
పడుకున్న సమయంలో
బాధితురాలు రచన తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులంతా పడుకున్న సమయంలో దొంగలు ఇంట్లోకి వచ్చారు. వారు మొదట కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న గదికి బయట నుంచి గడియ పెట్టేశారు. ఆ తర్వాత ఇల్లంతా వెతికి బంగారం, వెండి ఆభరణాలు, నగదుతో పాటు ఇంట్లో ఉన్న ఒక ఎనర్జీ డ్రింక్ బాక్స్‌ను కూడా ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండా ఉండటం కోసం ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల యాంగిల్స్‌ను ఒక కర్ర సహాయంతో మార్చేశారు.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో లేచిన కుటుంబ సభ్యులకు గది బయట నుంచి లాక్ చేసి ఉండటాన్ని గమనించారు. వెంటనే బంధువులకు ఫోన్ చేసి పిలవడంతో, వారు వచ్చి తలుపులు తీసి వీరిని రక్షించారు. దీనిపై నర్వార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అదనపు ఎస్పీ సంజీవ్ ములే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్ రచన గుర్జర్ ఇటీవల తన ఛానల్‌లో కొన్ని వీడియోలను పోస్ట్ చేసింది. ఒక వీడియోలో తన ఇంటి ఎంట్రన్స్ నుంచి లోపలి గదుల వరకు చూపిస్తూ పూర్తి హోమ్ టూర్ వీడియో చేసింది. దీనివల్ల ఇల్లు ఎలా ఉంటుంది, ఏ గది ఎక్కడ ఉందో దొంగలకు ముందే ఒక ఐడియా వచ్చేసింది. మరో వీడియోలో తన దగ్గర ఉన్న భారీ బంగారం నగలు, కట్టల కొద్దీ నగదును ఒక టేబుల్ మీద పెట్టి మరీ చూపించింది.
ఈ వీడియోలను చూసిన దొంగలు.. ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంది అనేదానిపై పక్కా ప్లాన్ వేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. దొంగలు ఆ గ్రామస్తులే అయి ఉంటారని భావిస్తున్నారు.
Follow Us