/rtv/media/media_files/2026/05/16/gujarat-2026-05-16-17-07-09.jpg)
సమాజం తలదించుకునే ఒక అత్యంత అమానవీయ, క్రూరమైన ఘటన గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో వెలుగుచూసింది. కేవలం రెండు వేల రూపాయల ఇంటి అద్దె బకాయిలు కట్టలేకపోయినందుకు.. ఒక కన్నతండ్రి, భర్త తన సొంత భార్యను, 13 ఏళ్ల మైనర్ కుమార్తెను ఇంటి యజమాని చేతిలో పెట్టాడు. అద్దె బదులుగా వారిద్దరిపై పదే పదే అత్యాచారం చేయడానికి సదరు యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కిరాతకానికి పాల్పడిన తండ్రితో పాటు, 55 ఏళ్ల కామాంధుడైన ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం ఆరు నెలల క్రితం మోర్బి ప్రాంతానికి వలస వచ్చింది. అక్కడ నెలకు రూ. 2,000 అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నారు. అయితే, వ్యాపారంలో నష్టాలు రావడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల గత నాలుగు నెలలుగా వారు ఇంటి అద్దె చెల్లించలేకపోయారు.
దారుణమైన డీల్
అద్దె డబ్బుల కోసం యజమాని ఒత్తిడి చేయడంతో.. ఆ కిరాతక తండ్రి దారుణమైన డీల్ కుదుర్చుకున్నాడు. అద్దె డబ్బులకు బదులుగా తన భార్యను, 13 సంవత్సరాల 7 నెలల వయసున్న మైనర్ కుమార్తెను అనుభవించవచ్చని యజమానికి అనుమతి ఇచ్చాడు. భర్త అంగీకారంతో సదరు యజమాని సదరు మహిళపై, మైనర్ బాలికపై వారి అద్దె ఇంట్లోనే కాకుండా, తన సొంత ఇల్లు, టంకార లోని మరో ప్రాంతానికి తీసుకెళ్లి పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, యజమాని బంధువు ఒకరు కూడా ఆ మహిళపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.
ఈ ఘోరం గురించి తెలుసుకున్న బాలిక అమ్మమ్మ హుటాహుటిన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని తీవ్రమైన సెక్షన్లతో పాటు కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
మైనర్ బాలిక తండ్రి, ఇంటి యజమాని ఇద్దరూ కలిసి ఈ ఘోరానికి ప్లాన్ చేశారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె.ఎమ్. లాల్ తెలిపారు. నిందితుడైన తండ్రిని పోలీసులు మొదటనే అరెస్ట్ చేయగా.. 55 ఏళ్ల యజమానిని కోర్టులో హాజరుపరిచి, ఒకరోజు పోలీస్ కస్టడీ అనంతరం జైలుకు తరలించారు. ఈ నేరానికి సహకరించిన యజమాని బంధువు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సైంటిఫిక్ ఆధారాలను సేకరించినట్లు ఇన్స్‌పెక్టర్ వై.బి. జడేజా పేర్కొన్నారు.
Follow Us