Telangana : జడ్చర్ల కేసులో బిగ్ ట్విస్ట్: వైష్ణవి మర్డర్ కేసులో ఊహించని మలుపు!

యువతి వైష్ణవి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఉదంతంలో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. వైష్ణవిపై దాడి చేసిన అనంతరం స్థానికుల చేతిలో తీవ్రంగా గాయపడి, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు తేజ మృతి చెందాడు

New Update
jadcharla

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో యువతి వైష్ణవి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఉదంతంలో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. వైష్ణవిపై దాడి చేసిన అనంతరం స్థానికుల చేతిలో తీవ్రంగా గాయపడి, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు తేజ మృతి చెందాడు. ఈ కేసులో పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మరికొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.  

నిమ్మబావి గడ్డ ప్రాంతంలో వైష్ణవిపై తేజ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోస్తుండగా గమనించిన కాలనీ వాసులు.. అతడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ దాడిలో తేజకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతడిని రక్షించి మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.

నిందితుడు తేజది హైదరాబాద్‌గా పోలీసులు గుర్తించారు. గతంలో వైష్ణవి హైదరాబాద్‌లో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది. అయితే, పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. వైష్ణవి ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, రెండేళ్లుగా తనను కేవలం డబ్బుల కోసమే వాడుకుందని తేజ తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఖాయం కావడంతో తట్టుకోలేకపోయిన తేజ.. కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

స్కూల్‌లో రిసెప్షనిస్టుగా

హైదరాబాద్‌ నుండి జడ్చర్ల వచ్చిన వైష్ణవి.. ప్రస్తుతం పోలేపల్లిలోని SVKR స్కూల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. కొన్ని నెలల క్రితమే ఓ యువకుడు తనను తీవ్రంగా వేధిస్తున్నాడని వైష్ణవి తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఆ వేధిస్తున్న వ్యక్తి తేజనేనా? లేక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఎంతవరకు ఆర్థిక లావాదేవీలు నడిచాయి? అనే విషయాలు తెలుసుకోవడానికి పోలీసులు వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాల్ డేటా, వాట్సాప్ చాట్స్ ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు కూడా మృతి చెందడంతో, మిగిలిన వివరాల కోసం హైదరాబాద్, మహబూబ్‌నగర్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి విచారణను ముమ్మరం చేశారు.

Advertisment
తాజా కథనాలు