Ashok Kharat case: నకిలీ బాబా కాల్ డేటా లీక్.. షిండేతో సంబంధాలపై CM ఫడ్నవీస్ సంచలనం!

మహారాష్ట్రలో 'గాడ్‌మ్యాన్ ఖరాత్'గా పిలవబడే అశోక్ ఖరాత్, ఆధ్యాత్మికత పేరుతో పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
_dgfsw

తాంత్రిక పూజల ముసుగులో మహిళలపై అకృత్యాలకు పాల్పడిన నాసిక్ నకిలీ బాబా అశోక్ ఖరాత్ ఉదంతం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం లేపుతోంది. ఈ కేసులో వెలుగుచూసిన ఫోన్ కాల్ డేటా రికార్డులు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. మహారాష్ట్రలో 'గాడ్‌మ్యాన్ ఖరాత్'గా పిలవబడే అశోక్ ఖరాత్, ఆధ్యాత్మికత పేరుతో పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ కేసు కేవలం నేరపూరిత కోణంలోనే కాకుండా రాజకీయ మలుపులు తిరుగుతోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో ఈ నకిలీ బాబా పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్న CDR రికార్డులు బయటకు రావడం కలకలం రేపింది.

సామాజిక కార్యకర్త అంజలీ దమానియా ఈ వివరాలను వెల్లడించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గుర్తు తెలియని వాట్సాప్ నంబర్ నుండి తనకు ఈ ఆడియో రికార్డింగ్స్, కాల్ డేటా లభించిందని ఆమె పేర్కొన్నారు. కీలక పదవిలో ఉన్న వ్యక్తికి ఓ నేరస్తుడితో సంబంధాలు ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో రెండు ప్రధాన అంశాలపై దర్యాప్తు జరిపిస్తామని ఆయన ప్రకటించారు.

దర్యాప్తు సంస్థల పరిధిలో ఉండాల్సిన కాల్ డేటా రికార్డులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయనేది సీరియస్ విషయమని ఆయన అన్నారు. ఒకరి వ్యక్తిగత కాల్ డేటాను పొందే హక్కు ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. ఈ డేటా లీక్ వెనుక ఉన్న వ్యక్తులను కనిపెట్టడానికి ED చేత విచారణ జరిపిస్తామని ఆయన వెల్లడించారు. అశోక్ ఖరాత్ అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవమేనని, అయితే కావాలనే ఉప ముఖ్యమంత్రిపై బురద చల్లే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్షాల డిమాండ్
మరోవైపు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్ష ఎన్సీపీ (ఎస్పీ) డిమాండ్ చేస్తోంది. ఉప ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనేది తేలాలని, బాబాతో ఉన్న సంబంధాలపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. మొత్తానికి, నకిలీ బాబా అశోక్ ఖరాత్ కేసు ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. అక్రమాలకు పాల్పడిన బాబాను శిక్షిస్తారా? లేక ఈ డేటా లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ 'ఆడియో లీక్స్' వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది ఈడీ దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు