భార్యను చంపిన మాజీ కెప్టెన్‌.. 4ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టించిన గ్యాస్ బుకింగ్!

పోలీసుల కళ్లు గప్పి నాలుగేళ్లుగా పరారీలో ఉన్న ఒక మాజీ ఆర్మీ కెప్టెన్, చివరకు ఒక చిన్న LPG సిలిండర్ బుకింగ్ వల్ల పోలీసులకు చిక్కాడు. భార్యను హత్య చేసిన కేసులో శిక్ష పడి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పంజాబ్ పోలీసులు మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు.

New Update
LPG booking

సినిమా లెవల్‌లో పోలీసుల కళ్లు గప్పి నాలుగేళ్లుగా పరారీలో ఉన్న ఒక మాజీ ఆర్మీ కెప్టెన్, చివరకు ఒక చిన్న LPG సిలిండర్ బుకింగ్ వల్ల పోలీసులకు చిక్కాడు. భార్యను హత్య చేసిన కేసులో శిక్ష పడి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పంజాబ్ పోలీసులు మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేసిన సందీప్ తోమర్, 2013లో పంజాబ్‌లోని అబోహర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తన భార్య శ్వేతా సింగ్‌ను హత్య చేశాడు. తొలుత దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసుల విచారణలో అది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తేలింది.

ఈ కేసును విచారించిన కోర్టు 2014లోనే అతడికి జీవిత ఖైదు విధించింది. అయితే, 2019లో బెయిల్‌పై బయటకు వచ్చిన తోమర్, అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తన ఆచూకీ దొరకకుండా పేరు, ఊరు మార్చి వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. 2022లో హైకోర్టు కూడా ఇతడి శిక్షను ఖరారు చేసినప్పటికీ, నిందితుడు దొరక్కపోవడంతో కేసు సవాలుగా మారింది.

సిలిండర్ తెచ్చిన చిక్కులు
నిందితుడి మామ రామ్ నరేష్ 2024లో హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ వేగవంతమైంది. ఫాజిల్కా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి టెక్నికల్ నిఘా పెట్టారు. ఈ క్రమంలో తోమర్ చేసిన ఒక చిన్న పొరపాటు పోలీసులకు క్లూ ఇచ్చింది. తోమర్ తన పాన్ కార్డుతో లింక్ అయి ఉన్న పాత బ్యాంక్ ఖాతాను ఉపయోగించి ఒక ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేశాడు. మధ్యప్రదేశ్‌లోని పాంధుర్నా జిల్లాలో ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్ లావాదేవీలు, గ్యాస్ ఏజెన్సీ రికార్డులను పరిశీలించగా అతడి ప్రస్తుత అడ్రస్ దొరికింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాంధుర్నాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

జ్యుడీషియల్ కస్టడీకి నిందితుడు
గత శనివారం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఎంత తెలివిగా తప్పించుకున్నా, సాంకేతిక ఆధారాలు ఏదో ఒక రూపంలో నేరస్తులను పట్టిస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఆర్మీలో కెప్టెన్ స్థాయి వ్యక్తి ఇలా నేరానికి పాల్పడి, చివరకు ఒక గ్యాస్ బుకింగ్‌తో పట్టుబడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు