NEET Results Scam: నీట్ పేపర్‌ లీక్‌ అయ్యిందా ? అసలేం జరిగిందంటే..

నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. 67 మందికి 720 మార్కులు రావడంతో ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయని.. మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకునేందేకు ఈ ఆర్టికల్ చదవండి.

New Update
NEET Results Scam: నీట్ పేపర్‌ లీక్‌ అయ్యిందా ? అసలేం జరిగిందంటే..

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్ కోర్సు్ల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 67 మంది విద్యార్థులకు వందశాతం (720) మార్కులు రావడంతో ఫలితాలపై అనేకమంది విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరీక్షను మళ్లీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి.. మోదీ ప్రభుత్వం విద్యార్థులతో ఆడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నీట్‌ పరీక్ష అక్రమాలకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు

మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ -2024 పరీక్షను నిర్వహించింది. మొత్తం 24 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు రెండు రోజుల ముందే ఓ స్కామ్ వెలుగులోకిరావడం కలకలం రేపింది. పరుశురామ్‌ అనే ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని, తుషార్‌భట్ అనే ఒక టీచర్‌ కలిసి గుజరాత్‌కు చెందిన 16 మంది స్టూడెంట్స్‌ను నీట్‌ పరీక్షలో పాస్ చేయించడం కోసం ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పరీక్ష జరిగిన రోజు కూడా నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యిందంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు ప్రశ్నాపత్నం ఇదేనంటూ దాని ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అదేరోజున నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఆ తర్వాత పలువురు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: 52 మంది కేంద్ర మంత్రులు వీరే.. పవన్‌కు మోదీ షాక్

పది రోజుల ముందుగానే ఫలితాలు ?

నీట్‌ ఫలితాలను రిలీజ్ చేయకుండా ఆదేశాలవ్వాలని.. పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరారు. అయితే నీట్ ఫలితాలను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ ఈ వ్యవహారంపై సమీక్ష చేయడానికి మాత్రం అంగీకరించింది. మరో విషయం ఏంటంటే వాస్తవానికి నీట్ ఫలితాను జూన్ 14న విడుదల చేయాల్సి ఉంది. కానీ ఎన్‌టీఏ మాత్రం లోక్‌సభ ఫలితాలు వచ్చిన రోజున అంటే జూన్‌ 4న నీట్‌ రిజల్ట్స్‌ను విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా మీడియా అంతా.. ఎన్నికల ఫలితాలపై ఫొకస్‌ చేయడంతో.. నీట్‌ పరీక్ష నిర్వహణలో, ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ఎవరూ పట్టించుకోలేదు. నీట్‌ అక్రమాలు బయటపడకుండా ఉండాలని.. ఎన్టీఏ కావాలనే పదిరోజులకు ముందుగానే ఫలితాలు విడుదల చేసిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అలా ఎలా మార్కులు వస్తాయి

నీట్‌ ఫలితాలను పరిశీలిస్తే.. ఇందులో ఏకంగా 67 మంది విద్యార్థులకు వందశాతం మార్కులు అంటే 720కి 720 మార్కులు వచ్చాయి. నీట్‌ చరిత్రలో ఇంతమంది విద్యార్థులు ఇలా ఫస్ట్‌ ర్యాంక్‌ను ఎప్పుడూ సాధించలేదు. మరో విషయం ఏంటంటే ఈ 67 మందిలో కూడా 8 మంది హర్యాణాలోని ఒకే పరీక్ష కేంద్రానికి చెందినవారు కావడం మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. అలాగే వీళ్ల హాల్‌టికెట్ నెంబర్లు కూడా ఒకే సిరీస్‌తో ఉన్నాయి. 67 మంది టాపర్లకు మొదటి ర్యాంకు వచ్చినప్పటికీ.. కౌన్సిలింగ్ ర్యాంకులను మాత్రం ఎన్టీఏ.. దశాంశ (డెసిమల్) పద్ధతిలో వేరువేరుగా ఇచ్చింది. అయితే దేని ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారన్నది మాత్రం తెలియజేయలేదు. మరికొంతమంది విద్యార్థులకు కూడా 717,718,719 మార్కులు కూడా వచ్చాయి. నీట్‌ పరీక్ష మూల్యాంకన పద్ధతి ప్రకారం చూసుతకుంటే ఇలా మార్కులు రావడానికి వీల్లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీనికి కారణం.. నీట్‌ పరీక్షలో సరైన జవాబుకు 4 మార్కులు వస్తాయి. తప్పు జవాబుకు ఒక మైనస్ మార్క్ ఉంటుంది. మొత్తం 180 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన విద్యార్థులకు 720 మార్కులు(ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు) వస్తాయి. 179 ప్రశ్నలకు సరైన సమాధానం రాసిన వారికి 716 వస్తాయి. ఒక ప్రశ్నకు తప్పు జవాబు ఇస్తే ఒక మార్కు తగ్గి 715 అవుతుంది. అంతేగానీ 717, 718,719 మార్కులు రావడం అసాధ్యమని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ పరీక్షలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీయే సమాధానం 

అయితే నీట్‌ పరీక్షపై ఎన్టీయే గురువారం స్పందించింది. కొన్ని సెంటర్లలో విద్యార్థులకు పరీక్ష సమయం వివిధ కారణాల వల్ల వృథా అయిందని తమ విచారణలో తేలిందని.. అందుకే 1563 మంది విద్యార్థులకు వృథా అయిన సమయాన్ని వారి ప్రతిభ ఆధారంగా అదనపు మార్కులు (గ్రేస్ మార్కులు) కలిపామని చెప్పింది. అందుకే 719,718 మార్కులు కొందరికి వచ్చినట్లు తెలిపింది. మరి ఒక్కో విద్యార్థికి ఎంత సమయం వేస్ట్‌ అయ్యింది అనేదానిపై ఎలా నిర్ణయం తీసుకున్నారో స్పష్టత లేదని విద్యార్థులు చెబుతున్నారు. పరీక్ష సమయం వృథా అయినప్పుడు అదనపు సమయం కేటాయిస్తే సరిపోతుంది కదా.. మార్కులు ఎలా కలుపుతారంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read: కేంద్రంలో కీలక పదవులు అన్నీ బీజేపీ నేతలకే..

నీట్‌లో 67 మందికి ఫస్ట్‌ర్యాంక్‌ రావడంపై కూడా ఎన్టీయే వివరణ ఇచ్చింది. గత ఏడాది 20,38,596 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షను రాస్కే.. ఈసారి 23,33,297 మంది రాశారని రాశారని తెలిపింది. విద్యార్థుల సంఖ్య పెరగడం వల్లే ఎక్కువగా స్కోర్ చేసిన వారి సంఖ్య కూడా పెరిగిందని చెప్పింది. 720 మార్కులు వచ్చిన 67 మందిలో.. 44 మందికి ఫిజిక్స్ ఆన్సర్‌ 'కీ' లో రివిజన్ ప్రకారం ఆ మార్కులు వచ్చాయని తెలిపింది. ఒకే ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉన్నాయని నిపుణులు సిఫార్సు చేసిన మేరకు రివిజన్ జరిగిందని పేర్కొంది. మరో ఆరుగురికి అదనపు మార్కులు కలపడం వల్ల 720 మార్కులు వచ్చాయని తెలిపింది.

కమిటీ సమీక్షిస్తుంది.

అలాగే నీట్‌ ఫలితాలు పది రోజుల ముందుగానే విడుదల చేయడంపై స్పందిస్తూ.. ఆన్సర్ కీ ఛాలెంజ్ గడువు ముగిసిన తర్వాత వీలైనంత వేగంగా ఫలితాలు వెల్లడిస్తుంటామని.. ఈసారి కూడా అలాగే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రూల్స్‌ ప్రకారమే ఫలితాలు వెల్లడించామని స్పష్టం చేసింది. అలాగే 1500 మందికి పైగా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను కమిటీ సమీక్షిస్తుందని.. ఆ తర్వాత ఫలితాలు సవరించే అవకాశముందని ఎన్డీయే డీజీ సుభోధ్ కుమార్ ప్రకటన చేశారు.

#neet-scam #telugu-news #neet
Advertisment
Advertisment
తాజా కథనాలు