/rtv/media/media_files/2026/03/10/rajendra-prasad-2026-03-10-16-51-13.jpg)
టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరుజారారు. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత లెజెండరీ నటుడు ఎం.జి. రామచంద్రన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.ఇటీవల కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డును రాజేంద్రప్రసాద్ కు ప్రకటించగా.. తాజాగా ఆయనకు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సీనియర్ నటుడు కాంతారావు నటనను చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఎంజీఆర్‌కు ప్యాంట్ తడిసేది
అంతటితో ఆగకుండా కాంతారావు చిత్రాలను చూస్తే ఎంజీఆర్‌కు ప్యాంట్ తడిసేది.. ఆయన యాక్టింగ్ చూసి వణికిపోయేవాడు అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసినఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. ఎంజీఆర్‌ను తమిళ ప్రజలు ఆరాధ్య దైవంగా పురట్చి తలైవర్ అని పిలుచుకుంటారు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తమిళ తంబిలు రాజేంద్రుడిపై మండిపడుతున్నారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక పెద్ద స్థాయి వ్యక్తి అయి ఉండి, మరో దిగ్గజ నటుడిని ఉద్దేశించి ఇలాంటి భాష వాడటం రాజేంద్ర ప్రసాద్ సంస్కారానికి తగదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా ఆయన బ్రహ్మానందం, అలీ వంటి తోటి నటులపై ఇలాంటి విచిత్రమైన కామెంట్స్ చేశారని, ఇప్పుడు ఏకంగా ఎంజీఆర్‌ను ఇందులోకి లాగడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల సినీ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారం పొందిన ఒక సీనియర్ నటుడు, బహిరంగ వేదికలపై ఇలాంటి పదజాలాన్ని వాడటం పట్ల అటు సినీ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. దీనిపై రాజేంద్ర ప్రసాద్ ఏమైనా వివరణ ఇస్తారేమో చూడాలి.
Follow Us