Allu Arjun: ఓ థియేటర్ జైలుకు పంపితే.. ఈ థియేటర్ హాలీవుడ్‌కు పంపాలంది!!

హైదరాబాద్ కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్‌పై ప్రసంశల వర్షం కురిపించారు. రెండేళ్ల క్రితం అల్లు అర్జున్‌పై అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

New Update
allu arjun

హైదరాబాద్ కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్‌పై ప్రసంశల వర్షం కురిపించారు. రెండేళ్ల క్రితం ఇదే అల్లు అర్జున్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అది 2024 డిసెంబర్ 4. తెలుగు రాష్ట్రాల్లో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీ పుష్పా 2 రిలీజ్‌ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌లో అప‌శృతి చోటుచేసుకుంది. 'పుష్ప 2' ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లాడు. ఇంకా చాలామందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసులను ఆదేశించారు. సెలబ్రిటీల కార్యక్రమాలు ఉన్నప్పుడు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జైలుకు వెళ్లిన అల్లు అర్జున్

అల్లు అర్జున్‌, ఆయన బౌన్సర్లు ఆ తొక్కిసలాటలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అసెంబ్లీలో మాట్లాడారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

తర్వాత అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడం, ఈ ఘటనలో బన్నీపై కేసు బుక్ అవ్వడం, ఆయన్ని అరెస్ట్ చేయడం అన్నీ జరిగిపోయాయి. డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి అభిమానులు, బన్నీ ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరిగింది. రెండు మూడు నెలలు సీఎం రేవంత్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అన్నట్లుగా కొనసాగింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 

బన్నీపై సీఎం ప్రసంశలు

అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌ ఓపెనింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోందని, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై నిలవాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మల్టీప్లెక్స్, హైదరాబాద్ సినిమా కళావైభవాన్ని మరింత పెంచుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ వంటి నటులు గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగినప్పుడు, అది కేవలం సినీ పరిశ్రమకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని ఆయన కొనియాడారు. "అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా ఇప్పటికే చెరగని ముద్ర వేశారు. ఇకపై ఆయన లక్ష్యం హాలీవుడ్ స్థాయిని అందుకోవాలి. అక్కడి సినిమాలతో పోటీపడేలా ఆయన భవిష్యత్ ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను," అని సీఎం వ్యాఖ్యానించారు.

ఇలా ఒక థియేటర్ హీరో అల్లు అర్జున్‌ను జైలుకు పంపితే.. మరో థియేటర్ ఇప్పుడు ఆయన్ని సీఎం రేవంత్ రెడ్డికు దగ్గర చేసిందని చర్చ జరుగుతోంది.

పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్న ముఖ్యమంత్రి

ఈ వేదికపై ముఖ్యమంత్రి తన వ్యక్తిగత జీవితంలోని సినీ అనుబంధాన్ని ఆసక్తికరంగా పంచుకున్నారు. ఒకప్పుడు థియేటర్లలో సినిమాలు చూసేందుకు లారీల్లో ప్రయాణించిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో సినిమా పట్ల ఉన్న ఆ మక్కువను, నేడు టాలీవుడ్ గ్లోబల్ స్థాయిలో ఎదుగుతున్న తీరును పోల్చుతూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమకు ప్రభుత్వ పూర్తి మద్దతు

తెలంగాణ అభివృద్ధిలో చిత్ర పరిశ్రమ పాత్రను ప్రభుత్వం గుర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఐటీ, ఫార్మా రంగాలతో సమానంగా సినిమా రంగాన్ని కూడా అత్యంత ముఖ్యమైన పరిశ్రమగా పరిగణిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో హాలీవుడ్ స్థాయి షూటింగ్‌లు జరిగేలా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి, ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందని భరోసా ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు