Asha Bhosle : లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన దిగ్గజ గాయని మెలోడీ క్వీన్ ఆశా భోంస్లే (92) ఇక లేరు.

New Update
asha

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన దిగ్గజ గాయని మెలోడీ క్వీన్ ఆశా భోంస్లే (92) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

ఛాతిలో ఇన్ఫెక్షన్, తీవ్రమైన అలసట కారణంగా శనివారం ఆమె ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అత్యుత్తమ చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆశా భోంస్లే మరణవార్త తెలియగానే చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

20కి పైగా భాషల్లో 12 వేల పాటలు

సుమారు ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె 20కి పైగా భాషల్లో 12 వేల కంటే ఎక్కువ పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా.. మెలోడీలు, పెప్పీ సాంగ్స్, గజల్స్, భజనలు ఇలా ఏ ప్రక్రియలోనైనా తనదైన ముద్ర వేశారు. 

ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. తల్లి శేవంతి మంగేష్కర్. ఆమెకు సోదరిమణులు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా ఖాదికర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్, మనవరాలు జనాయ్ భోస్లే ఉన్నారు.

ఏడు సార్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు అందుకున్నారు. ఆమె పదిహేడు మహారాష్ట్ర రాష్ట్ర అవార్డులను అందుకున్నది. ఆమెను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది.

 ఆశా భోస్లే రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆశా భోస్లే తన 16వ ఏట, కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా గణపత్రావ్ భోంస్లేను 1949లో వివాహం చేసుకున్నారు. ఆయన లతా మంగేష్కర్ కార్యదర్శిగా పనిచేసేవారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అయితే ఈ బంధంలో విభేదాల కారణంగా 1960లో వారు విడాకులు తీసుకున్నారు.   ఆ తర్వాత ఆశా భోస్లే ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ (రాహుల్ దేవ్ బర్మన్) ను 1980లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు కలిసి పలు చిరస్మరణీయమైన పాటలను రూపొందించారు. 1994లో ఆర్.డి. బర్మన్ మరణించే వరకు వీరి వివాహ బంధం కొనసాగింది

ఆమె మృతి పట్ల ప్రధానమంత్రి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు