AP high court:ఏపీ హైకోర్టులో చంద్రబాబు, నారా లోకేష్ పిటిషన్ల విచారణ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ బెయిల్ పిటిషన్ల విచారణ నేడు ఏపీ హైకోర్టులోకి రానుంది. ముందస్తు బెయిల్ కోసం వీరు ఈ పిటిషన్లు వేశారు. By Manogna alamuru 04 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఫైబర్ నెట్ స్కామ్‌లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఆంధ్రప్రదేశ్ ఉన్నతన్యాస్థానం ఈరోజు విచారణ జరపనుంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు రావాలన్న నోటీసుల మీద తన ఇంటి దగ్గరే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ దాకలు చేసిన పిటిషన్ మీద కూడా నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వీటితో పాటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ల మీద కూడా విచారణ కొనసాగనుంది. మరో ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని సీఐడీ చెప్పింది. మరోవైపు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసు కూడా విచారణకు వస్తోంది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసును కూడా సీబీఐకి బదిలీ చేయాలని కూడా ఆర్కే మరొక పిటిషన్ వేశారు. ఇక అక్టోబర్ 10 సీఐడీ ముందుకు హాజరు కావాలని నారా లోకేష్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఇవాళ జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై రోహాత్గీ స్పందిస్తూ, అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు. బెయిల్ కోసం వెళ్ళకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని ఏపీ సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని అన్నారు. 2018లో 17ఏ సవరణ జరిగిందని, స్కిల్ నేరం అంతకుముందే జరిగిందని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వందల కోట్ల అవినీతి జరిగిందని రోహత్గీ పేర్కొన్నారు. జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ... అవినీతి సంగతి తర్వాత, ముందు 17ఏ గురించి చెప్పండి అని ప్రశ్నించారు. సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని కేసులకు వర్తిస్తుందా? అని అడిగారు. అన్ని కేసులకు వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది సాల్వే బదులిచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే స్పష్టం చేశారు. మరో న్యాయవాది మను సింఘ్వీ 17ఏ అంశంపై వాదనలు వినిపించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మను సింఘ్వీ కోర్టుకు వివరించారు. 2021 డిసెంబరు 9న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. ఒకదాని వెంట ఒకటి ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధార్థ లూథ్రా కలుగజేసుకుంటూ, ఈ కేసులో చంద్రబాబును సుదీర్ఘకాలం జైల్లో ఉంచాలన్న కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిసన్ మీద హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. #nara-lokesh #high-court #chandrababu #andhra-paradesh #petition #hearing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి