/rtv/media/media_files/2026/06/05/latest-telugu-news-2026-06-05-19-28-44.jpg)
సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. కానీ ప్రస్తుత కాలంలో ఇల్లు కట్టాలంటే కనీసం ఆరు నెలల నుండి ఏడాది పాటు సమయం పడుతుంది. పునాదులు తవ్వడం, పిల్లర్లు వేయడం, స్లాబ్ పోయడం, ఆ తర్వాత అది ఎండడం.. ఇలా ఎంతో సమయం, శ్రమతో కూడుకున్న పని ఇది. అయితే తెలంగాణలో కేవలం రూ.5 లక్షలతో 12 రోజుల్లోనే ఒక పూర్తి స్థాయి ఇల్లును నిర్మించి ఇంజనీర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సాకారం చేశారు.
ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!
సాధారణంగా మనం కట్టే ఇళ్లలో బరువునంతా మోయడానికి పిల్లర్లు, బీమ్‌లు నిర్మిస్తాం. ఆ తర్వాత ఇటుకలతో గోడలను కడతాం. కానీ 'షీర్ వాల్ టెక్నాలజీ'లో పిల్లర్లు, బీమ్‌లు అనేవి విడిగా ఉండవు. ఇందులో ఇటుకలను అస్సలు ఉపయోగించరు. కాంక్రీట్, ఇనుప చువ్వలతో కూడిన బలమైన గోడలనే పిల్లర్లుగా మారుస్తారు. అంటే ఇక్కడ గోడలే ఇంటి బరువును మోస్తాయి. ఈ టెక్నాలజీలో మొదట ఇంటి నమూనాకు సరిపోయేలా అల్యూమినియం లేదా స్టీల్ ఫామ్‌వర్క్ సిద్ధం చేస్తారు. అందులో ఇనుప రాడ్లను అమర్చి.. ఒకేసారి హై-గ్రేడ్ కాంక్రీట్ మిశ్రమాన్ని పోస్తారు. దీనివల్ల గోడలు, స్లాబ్ అన్నీ ఒకే అచ్చుగా మారిపోతాయి.
సాధారణ ఇటుకల గోడలు కడితే సిమెంట్లు ఆరడానికి, క్యూరింగ్ వారాల తరబడి సమయం పడుతుంది. కానీ ఈ టెక్నాలజీలో ఉపయోగించే అల్యూమినియం షట్టరింగ్ విధానం వల్ల కాంక్రీట్ చాలా వేగంగా సెట్ అవుతుంది. గోడలు పోసిన కొద్ది గంటల్లోనే బాక్సులను తొలగించి పై అంతస్తు పనులను ప్రారంభించవచ్చు. గోడలకు ప్లాస్టరింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే నునుపైన ఉపరితలం వస్తుంది. దీనివల్ల వైరింగ్, ప్లంబింగ్ పనులు కూడా సమాంతరంగా జరిగిపోతాయి. పనులన్నీ ఒక క్రమపద్ధతిలో జరగడం వల్ల కేవలం 12 రోజుల్లోనే పునాది నుండి స్లాబ్ వరకు ఇల్లు ముస్తాబైంది.
ఇది కూడా చూడండి: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: చైనా, టర్కీ ఆయుధాలపై పాక్ కన్ను!
ఈ టెక్నాలజీ కేవలం సమయాన్ని ఆదా చేయడమే కాదు. సాంప్రదాయ ఇళ్ల కంటే ఎంతో బలమైనది. ఇటుకల గోడలలో ఉండే జాయింట్లు దీనికి ఉండవు. కాబట్టి భవనం అంతా ఒకే కాంక్రీట్ బ్లాక్‌లా ఉంటుంది. దీనివల్ల భారీ భూకంపాలు, తుఫానులు వచ్చినప్పుడు వచ్చే ఒత్తిడిని ఈ షీర్ వాల్స్ సమానంగా పంచుకుంటాయి. ఫలితంగా భవనం కూలిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఎత్తైన అపార్ట్‌మెంట్లు, స్కైస్క్రేపర్స్ నిర్మాణంలో ఈ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు.
ఈ విధానం వల్ల నిర్మాణ సమయం 50 శాతానికి పైగా తగ్గుతుంది. ఇటుకలు, ఇసుక వాడకం లేకపోవడం వల్ల సైట్ క్లీన్‌గా ఉంటుంది. గోడలు నునుపుగా ఉండటం వల్ల లోపల కార్పెట్ ఏరియా కూడా కొద్దిగా పెరుగుతుంది. అయితే ఇందులో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇల్లు ఒకేసారి కాంక్రీట్‌తో పోయడం వల్ల భవిష్యత్తులో మనకు నచ్చినట్లు గోడలను పగలగొట్టి కిటికీలు పెట్టడం లేదా రూమ్ సైజులు మార్చడం సాధ్యం కాదు. అలాగే ఒకే ఒక్క ఇల్లు కట్టడానికి ఈ టెక్నాలజీ వాడితే ఖర్చు చాలా ఎక్కువవుతుంది. కానీ ఒకే లేఅవుట్‌లో వందలాది ఇళ్లను ఒకే నమూనాతో కట్టాల్సి వచ్చినప్పుడు ఈ టెక్నాలజీ కంటే చౌకైనది, వేగవంతమైనది మరొకటి లేదు.
Follow Us