OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

New Update
open ai

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఆయన ఇంటి వద్ద ఏప్రిల్ 10వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:45 గంటలకు ఈ ఘటన జరిగింది. 20 ఏళ్ల యువకుడు వెలుగుతున్న వస్త్రం ఉన్న సీసాను ఇంటి ప్రధాన ద్వారం వద్దకు విసిరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అదృష్టవశాత్తూ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

5 కిలోమీటర్ల దూరంలో

ఈ ఘటన జరిగిన గంట తర్వాత, అంటే ఉదయం 5 గంటల సమయంలో.. ఆల్ట్‌మన్ నివాసానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓపెన్ ఏఐ ప్రధాన కార్యాలయాన్ని తగులబెడతానని ఒక వ్యక్తి బెదిరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆల్ట్‌మన్ ఇంటి సీసీటీవీ దృశ్యాల్లో ఉన్న వ్యక్తి, ఇక్కడ బెదిరిస్తున్న వ్యక్తి ఒక్కరేనని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వివరాలు లేదా దాడికి గల కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

ఏఐవల్ల సమాజానికి ముప్పు పొంచి ఉందని భావించే కార్యకర్తల నుంచి గతంలోనూ ఓపెన్ ఏఐకి బెదిరింపులు వచ్చాయి. గతేడాది నవంబర్‌లో ఒక వ్యక్తి ఏఐ కార్యాలయంలో చంపేస్తా అని బెదిరించడంతో ఆఫీసును తాత్కాలికంగా మూసివేశారు. అలాగే అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ ఏఐ ఒప్పందాలు చేసుకోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ తాజా దాడి మానసిక సమస్యల వల్ల జరిగిందా లేక ఉగ్రవాద కోణం ఉందా అనేది ఇంకా తెలియలేదు.

దాడి జరిగిన తర్వాత శామ్ ఆల్ట్‌మన్ తన బ్లాగ్‌లో తన కుటుంబ ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగంగా స్పందించారు. "నాకు ప్రపంచంలో నా కుటుంబమే మిన్న. మా ఇంటిపై ఎవరూ ఇలాంటి దాడులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫోటోను షేర్ చేస్తున్నాను" అని రాశారు. ఆ ఫోటోలో ఆయన తన జీవిత భాగస్వామి, చిన్నారి కుమారుడితో కలిసి ఉన్నారు. ఏఐ సాంకేతికతపై వస్తున్న విమర్శలను తాము స్వాగతిస్తామని, చర్చలు జరుపుదామని.. కానీ ఇలా పేలుళ్లకు పాల్పడటం సరికాదని ఆయన హింసను ఖండించారు.

Advertisment
తాజా కథనాలు