Hyderabad: కేపీహెచ్‌బీలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ముగ్గురు మృతి

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీలోని అడ్డగుట్ట కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు.

New Update
Hyderabad: కేపీహెచ్‌బీలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ముగ్గురు మృతి

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కేపీహెచ్‌బీ  (KPHB)కాలనీలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అడ్డగుట్టలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు స్పాట్‌లోనే చనిపోయారు. 6వ అంతస్తు నుంచి సిమెంట్ ఇటుకలు కూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన హైదర్‌నగర్ డివిజన్ అడ్డగుట్టలో చోటు చేసుకుంది. అడ్డగుట్టలో దాసరి సంతోష్, దాసరి శ్రీరామ్ అనే వ్యక్తులు సర్వే నెంబర్ 176పి, 177పి,188పిలోని 668 గజాలలో నిర్మాణం చేపట్టారు. దీనికి కూకట్‌పల్లి జీహెచ్ఎంసీ అధికారులు స్టిల్ట్ ప్లస్ 5 అంతస్థుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అయితే ఇప్పటికే ఐదు అంతస్థులు పూర్తి చేసుకున్న ఈ నిర్మాణంలో పైన ఉన్న ప్రహారీ గోడ కడుతున్న క్రమంలో పక్కకు ఒరిగిన గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో గోడ కట్టపై ఉండి పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన ఐదుగురు కూలీలు అక్కడి నుండి కిందకు పడిపోయారు. ఈఘటనలో సంతోష్, సోనీ అనే ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని దగ్గరలోని ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. ఇంకొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

6వ అంతస్తు నుంచి నాసిరకం సిమెంట్ ఇటుకలో ఇళ్లు నిర్మాణం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భారీ వర్షాల కారణంగా కూడా ఈ గోడ కూలిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షాలకు గోడలు నాని ఈ భవనంపై గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా..? అని ఆరా తీస్తున్నారు. ఇంటి యజమాని నిర్లక్ష్యం ఉన్నా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. అయితే అడ్డగుట్టలో మెయిన్ రోడ్డు పక్కనే ఈ భవన నిర్మాణం జరుగుతోంది. గురువారం ఉదయం కూలీలు పనులు చేస్తున్న సమయంలో సెంట్రింగ్ కర్రలు ఒక్కసారిగా విరిగి కింద పడ్డాయి. దీంతో నిర్మాణ పనుల్లో ఉన్న కూలీలు ఆరో అంతస్తు నుంచి కిందపడ్డారు. అంతేకాకుండా గోడ కూలి ఇటుకలు చెల్లాచెదురుగా రోడ్డు మీద పడ్డాయి.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు