రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టిన బీజేపీ.. అర్హులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్‌

New Update
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టిన బీజేపీ.. అర్హులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్‌

BJP, which has taken up dharna across the state, has demanded that double bedroom houses be distributed to the deserving  

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జాప్యంపై బీజేపీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. వరంగల్‌ జిల్లాలో బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల.. కేసీఆర్‌ సర్కార్‌ సుమారు 45 వేల కోట్ల మద్యం పన్నును రాష్ట్ర ప్రజల నుంచి వసూళ్లు చేసినట్లు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం పేదల కోసం ఇండ్లు నిర్మించామని చెప్పుకుంటూ వాటిని పంపిణీ చేయడంలో మాత్రం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో అవి పలు చోట్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సైతం బీజేపీ ధర్నాకు దిగింది. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ శ్రేణులతో పాటు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. పేదలకు డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పంపిణీ చేయని పక్షంలో తమ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వైఎస్‌ఆర్‌ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ.. ప్రభుత్వం పేదలకు ఇళ్లను పంపిణీ చేస్తామని ఊరిస్తూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. గత 4 సంవత్సరాలుగా ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పుకుంటూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణం పూర్తై ఏడాది గడిచినా పంపిణీ చేయడంలో జాప్యం ఎందుకు చేస్తుందో అర్ధం కావడం లేదన్నారు. ఎన్నికల సమయంలోనే బీఆర్‌ఎస్‌కు పేదలు గుర్తుకు వస్తారని, ఎన్నికల్లో గెలుపొందేందుకు అనేక హామీలు ఇచ్చి గెలిచాక పేదలను పట్టించుకోవడంలేదని విమర్శించారు.

నారాయణ పేట జిల్లాలో మాజీ ఎంపీ జీతేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నిరసనకు దిగింది. మొదట జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పరిశీలించిన జితేందర్‌ రెడ్డి అనంతరం ధర్నాకు దిగారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తామే చేసినట్లు గొప్పలు చెప్పకుంటోందని ఆయన విమర్శించారు.

సిద్ధిపేట జిల్లాలో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. జిల్లాలోని కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని అమలుచేయకుండా ఎందుకు అలసత్వం వహిస్తున్నారో చెప్పాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం క్రింద లక్షల ఇల్లు నిర్మాణం చేస్తే తెలంగాణలో మాత్రం కేసిఆర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.

మరోవైపు నిజామాబాద్‌ జిల్లాలో సైతం బీజేపీ ఆందోళన చేపట్టింది. జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు ఖాళీగా ఉండటంతో అవి మద్యానికి అడ్డగా మారాయన్నారు. ప్రభుత్వం ఇళ్ల పంపిణీలో ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడంలేదన్నారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా స్పందించి అర్హులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు