ఈ వినాయకుని చెవిలో చెబితే మీ కోరిక నెరవేరినట్లే..ఈ గుడి ఎక్కడ ఉందంటే!

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం అంటే ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామి వారికి మన కోరికలు చెవిలో చెబితే చాలు ఆయన వాటిని విని వెంటనే తీరుస్తాడని ఓ నమ్మకం.

New Update
ఈ వినాయకుని చెవిలో చెబితే మీ కోరిక నెరవేరినట్లే..ఈ గుడి ఎక్కడ ఉందంటే!

మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలన్న, పనులు చేయాలన్న, శుభకార్యాలు మొదలు పెట్టాలన్న ముందుగా అందరం తలచుకునే భగవంతుడు వినాయకుడు. విఘ్నాలకు అధిపతి అవ్వడం వల్ల చేపట్టే పనిలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆయనను తలచుకుని కార్యక్రమాలు మొదలు పెడతాం.

ప్రపంచ వ్యాప్తంగా వినాయకునికి అనేక గుడులు కూడా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం అంటే ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామి వారికి మన కోరికలు చెవిలో చెబితే చాలు ఆయన వాటిని విని వెంటనే తీరుస్తాడని ఓ నమ్మకం.

ఆ నమ్మకంతోనే స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు బిక్కవోలు గ్రామానికి తరలి వస్తుంటారు. ఇక్కడ ఉన్న ఆలయం కూడా వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నది. ఇక్కడ స్వామి వారు ఏకశిలా విగ్రహాంగా కొలువై ఉన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉంటారు.

ఇక్కడ స్వామి వారి తొండం కుడి వైపునకు తిరిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ప్రస్తుతం ఉన్న ఈ విగ్రహాం తూర్పు చాళుక్యుల కాలం నాటిది. తొమ్మిదో శతాబ్దానికి చెందిన స్వామి వారి విగ్రహాం కాల క్రమంలో భూమిలో స్థాపితం అయ్యింది. ఆ తరువాత 19 వ శతాబ్ధంలో పంట పొలాల్లో ఇప్పుడు ఉన్న విగ్రహాం దొరికింది.

అయితే దీనిని తీసుకుని వెళ్లి వేరే చోట ప్రతిష్టించి..పూజలు చేయాలని ప్రజలు భావించారు. కానీ.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా స్వామి వారి విగ్రహాం అక్కడ నుంచి కొంచెం కూడా కదల్లేదు. దాంతో అక్కడే స్వామి వారిని ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణం కూడా చేపట్టారు.

అప్పట్లో రాజులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారి చెవిలో వారి కోరికలు చెప్పి పనులు ప్రారంభిస్తే ఏ పనైనా ఇట్టే అయ్యేదని ప్రతీతి. ఇప్పటికీ కూడా భక్తులు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..స్వామి వారి చెవిలో తమ కోర్కెలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ వినాయక నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఇక్కడి స్వామి వారు రోజురోజుకి పెరుగుతూ ఉంటారు. అందుకు సాక్ష్యం ఆయన విగ్రహానికి వేసిన వెండి జాద్యమే. అది రోజురోజుకి చిన్నది అవుతూ ఉంటుంది. దీంతో స్వామి వారు నిత్యం పెరుగుతున్నాడు అనడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామి వారితో పాటు సుబ్రహ్మాణ్యేశ్వర స్వామి వారు కూడా కొలువై ఉన్నారు.

వినాయక నవరాత్రులతో పాటు సుబ్రహ్మాణ్యేశ్వర స్వామి వారి ఉత్సవాలు కూడా ఇక్కడ ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఇక్కడికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

రాజమండ్రి విమానాశ్రయం బిక్కవోలు గ్రామానికి 39 కిలో మీటర్ల దూరం. కాకినాడ రైల్వే స్టేషన్ అయితే 30 కిలోమీటర్లు, రాజమండ్రి రైల్వే స్టేషన్‌ అయితే 34 కిలో మీటర్లు దూరం ఉంటుంది. రాజమండ్రి, కాకినాడ బస్‌ స్టేషన్ల నుంచి ప్రతి పదినిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు