/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kishanreddy-jpg.webp)
Kishan Reddy Letter to Pinarayi Vijayan: కేరళ లోని శబరిమల(Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. ఈ విషయం గురించి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్(Pinarayi Vijayan) కు ఆయన లేఖ రాశారు. కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటి మందికి పైగా భక్తులు శబరిమల వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 15 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం అక్కడ సౌకర్యాలు సరిగా లేని కారణంగా చాలా మంది స్వామి భక్తులు స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు.
ఇటీవలే స్వామి సన్నిధానంలో తొక్కిసలాట జరిగిన క్రమంలో ఓ బాలిక చనిపోయిన విషయం చాలా బాధాకరమని పేర్కొన్నారు. అయ్యప్ప స్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో ప్రభుత్వం తరుఫున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు ఆయన లేఖలో వివరించారు.
శబరిమల పై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయాలని ఆయన కోరారు. అయ్యప్పస్వామి మండల దీక్షలో ఉన్న భక్తులకు శబరిమల యాత్ర సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించడం, వారి యాత్ర భక్తిప్రద్రంగా, శుభప్రదంగా జరిగేలా చూడడం అత్యంత అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం భక్తులకు సౌకర్యార్థం అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.
పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థలను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని ఆయన కోరుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో మీరు వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు.
Also read: మరో బేబీ రాబోతుందంటున్న మెగా కోడలు ఉపాసన!