ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన 13 మంది ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్‌ మార్కాపురం జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది.

New Update
Markapuram

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఢీకొన్న ధాటికి డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తానికి వ్యాపించాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటంతో, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు వారిని చుట్టుముట్టాయి. ఈ ఘోర అగ్నిప్రమాదంలో 13 మంది ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయి సజీవదహనమయ్యారు.

పెరగనున్న మృతుల సంఖ్య..

బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. కొంతమంది కిటికీలు పగులగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో రాయవరం ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisment
తాజా కథనాలు