/rtv/media/media_files/2025/02/11/7PVIYde4wVME8IY1AswD.jpg)
Manyam Bandh
Manyam Bandh : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బంద్ జరగనుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి.1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌తో ఈ బంద్ కొనసాగుతోంది.. ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ప్రజా సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అయ్యన్న పాత్రుడు కామెంట్ చేశారు. అన్నారు అయ్యన్న. అలా చేస్తే 1/70 చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది ఆదీవాసీల ఆందోళన. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఇది కూడా చదవండి: JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్
పర్యాటక ప్రాంతాల ప్రయివేటుకు కుట్ర
ఈ బంద్‌కు ఏజెన్సీ అంతటా విశేష స్పందన లభిస్తోందని ఆదివాసీ, గిరిజన సంఘాలు చెబుతున్నాయి.. స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047లో భాగంగా టూరిజం పాలసీని ముందుకుతెచ్చిన కూటమి ప్రభుత్వం ప్రకృతి సిద్ధమైన ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను ప్రయివేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తుందని ఆదివాసీలు మండిపడుతున్నారు.. పాలకుల విధానాల ఫలితంగా గిరిజన సలహా మండలి (టీఏసీ), పీసా చట్టం వంటి గిరిజన రక్షణ కవచాలు ఒక్కొక్కటీ నిర్వీర్వమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతంలో గిరిజనులకు ఉద్యోగ రిజర్వేషన్‌ను కల్పించే జీవో 3 రద్దుతో అనేక మంది గిరిజనేతర ఉద్యోగులు ఏజెన్సీకి రావడంతో ఇక్కడి గిరిజన యువతకు ఉద్యోగాలు లేకుండాపోయాయి. ఈ విషయమై ఆదివాసీల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు కొన్నాళ్లుగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో స్పీకర్ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.
Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!
బంద్ ప్రభావంతో వీధులన్నీ నిర్మానుష్యం
బంద్ ప్రభావంతో అరకు, పాడేరు ఏరియాలో పర్యాటక కేంద్రాలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి.. ఇక, నేడు జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేశారు అధికారులు.. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటడంతో ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించారు పోలీసులు.. అయితే, వాహనాల రాకపోకలను నిరసనకారులు అడ్డుకుంటున్నారు.ఉదయం నుంచే రోడ్డు పైకి వైసీపీ, వామపక్షాల నేతలు, ఆదివాసీ సంఘాలు వచ్చి షాపులను మూసి వేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు తిరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వ్యాపార వాణిజ్య సంస్థలు, మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు మూతపడ్డాయి. బంద్ ప్రభావంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ మరో 24 గంటలు మిగిలి ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
Also Read: పారిస్ ఏఐ సమ్మిట్.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ
గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం -చంద్రబాబు
దీనిపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని అన్నారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేననే విషయాన్ని తాము బలంగా నమ్ముతున్నామని, అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని, అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో 3ను తీసుకొచ్చామని, గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయ్యిందని ఆయన ఆరోపించారు.
ఇది కూడా చదవండి: రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగారంటే ఈ సమస్యలన్నీ పరార్