CM Chandrababu : రాజమండ్రిలో కల్తీపాల విషాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

New Update
CHANDRABABU

రాజమండ్రిలో చోటుచేసుకున్న కల్తీపాల(Rajahmundry milk) కలకలం ఇప్పుడు పెను విషాదంగా మారింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూపెరుగుతుండటం స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కల్తీపాలు తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదుగురికి చేరింది. కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనకరత్నం, కృష్ణవేణి, రమణి అనే ముగ్గురు మహిళలు మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు కలవరపెడుతున్నాయి.

Also Read :  కేసీఆర్‌కు మంత్రి వాసంశెట్టి వార్నింగ్: ఏపీలో అడుగుపెడితే తన్ని తరిమేస్తాం!

సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రాజమండ్రి(rajamundry) లోనే ఉండి, ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ ఘటనపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

మరోవైపు, అధికారులు ఈ కల్తీపాల మూలాలను వెతికే పనిలో పడ్డారు. ఇప్పటికే సుమారు 75 మంది బాధితుల నుంచి శాంపిల్స్‌ సేకరించారు. అసలు ఆ పాలలో ఏముంది? అవి ఎలా కల్తీ అయ్యాయి? అన్నది తెలుసుకోవడానికి సేకరించిన నమూనాలను ముంబై, విజయవాడలోని అత్యాధునిక ల్యాబ్‌లకు పంపించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులైన విక్రయదారులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు.

Also Read :  అసెంబ్లీలో లడ్డూ ఫైట్: లోకేష్ vs బొత్స మధ్య మాటల యుద్ధం!

క్షేత్రస్థాయిలో చర్యలు

ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. అక్కడ ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి, పాలు తాగిన ప్రతి ఒక్కరికీ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా స్వల్ప అనారోగ్య లక్షణాలు ఉన్నా తక్షణమే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఉన్న పాలను వాడకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు