/rtv/media/media_files/2025/02/25/E0usHXafwniK6qF4XV7t.jpg)
ఏపీలో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. మార్చి 29లోగా ఐదుగురి ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ ఐదు స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మార్చి 3న నోటిఫికేషన్ రిలీజ్ చేసి 20వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్య పరంగా చూస్తే ఈ ఐదు స్థానాలు కూటమి ప్రభుత్వానికే దక్కనున్నాయి.
అయితే ఈ స్థానాలు కూటమి సర్కార్ లో ఎవరెవరికి దక్కుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీలకు చెరోకటి వెళ్తాయి. మిగిలిన మూడు స్థానాలు టీడీపీ నేతలకు దక్కనున్నాయి. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఖరారు కానుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబును రాజ్యసభకు పంపాలని కూటమి సర్కార్ ప్లాన్ చేసింది. కానీ ఆయన రాష్ట్ర క్యాబినెట్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తపరిచడంతో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోంది.
ఇక బీజేపీ నుంచి పివిఎన్ మాధవ్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈయన 2017లో ఏపీ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023లో శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈయన తండ్రి చలపతిరావు గతంలో బీజేపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక టీడీపీ నుంచి ఆశావాహుల లిస్టు బాగానే ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నేత మోపిదేవి వెంకటరమణారావు, వంగవీటి రాధా, బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణరాజు, పిఠాపురం వర్మలు లిస్టులోఉన్నట్లుగా తెలుస్తోంది.
మోపిదేవికి చంద్రబాబు హామీ
ఇందులో ముగ్గురికి మాత్రమే ఛాన్స్ దక్కనుంది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి, బీదా మస్తాన్ రావు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇందులో బీదా మస్తాన్ రావుకు తిరిగి రాజ్యసభ సీటునే కట్టబెట్టారు చంద్రబాబు. మోపిదేవి స్థానంలో సానా సతీశ్‌కు అవకాశం ఇచ్చారు. అయితే మోపిదేవికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక లిస్టులో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రకు కూడా ఛాన్స్ దక్కే అవకాశం లేకపోలేదు. ఇటీవల ఆయన కుమారుడి పెళ్లికి కూడా సీఎం చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు.
వర్మకు డౌట్
వంగవీటి రాధా, మంతెన సత్యనారాయణరాజు, పిఠాపురం వర్మల పేర్లు లిస్టులో ఉండగా.. వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది చూడాలి. 2004లో చివరిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా మళ్లీ చట్ట సభల్లో అడుగు పెట్టలేదు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 2024 కూటమి గెలుపులో రాధా పాత్ర కూడా ఉందనే చెప్పాలి. ఇక తన సీటును త్యాగం చేసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గెలుపులో కీ రోల్ పోషించిన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు కచ్చితంగా ఎమ్మెల్సీ పదవీ ఖాయమనే చర్చ నడుస్తున్నప్పటికీ, జనసేన ఆయనకు మద్దతు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. మంతెన సత్యనారాయణరాజుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఎవరికీ అవకాశం దక్కనుంది అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
Also Read : మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే