/rtv/media/media_files/2025/01/14/QKlEu1V6eqrZutJLp31f.jpg)
YS Jagan, Vidadala Rajini, Marri Rajashekhar (File Photos)
ఏపీలో అధికారానికి దూరమైన వైసీపీకి కీలక నేతలు వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కిలారి రోశయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ తదితర కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నేత మర్రి రాజశేఖర్ కూడా వైసీపీని వీడడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మర్రి పార్టీని వీడితే గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటుగా పేరున్న మర్రి రాజశేఖర్.. 2004లో చిలకలూరిపేట నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ తనయుడు జగన్ వెంట నడిచారు.
2014 నుంచి కష్టాలు..
వైసీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ సారథిగా వ్యవహరించారు. టీడీపీ ప్రభావం అత్యధికంగా ఉండే గుంటూరు జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఆయన కృషి చేశారన్న పేరు ఉంది. అయితే.. 2014 ఎన్నికల్లో ఆయన మరోసారి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వైసీపీలో మర్రి రాజశేఖర్ కు కష్టాలు మొదటయ్యాయి. అనంతరం టీడీపీ నుంచి వచ్చి చేరిన విడదల రజినికి చిలకలూరిపేట పార్టీ బాధ్యతలు అప్పగించారు జగన్. మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రిగా తన పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్.
కానీ మంత్రిని చేస్తానన్న మాటను మాత్రం నిలబెట్టుకోలేదు. మరోవైపు విడదల రజినికి మంత్రి పదవిని ఇచ్చారు. అయితే.. ఎన్నికల సమయంలో రజినిని ఇక్కడి నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించింది వైసీపీ. దీంతో మర్రి రాజశేఖర్ కు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ గుంటూరు మేయర్ ను తీసుకువచ్చి ఇక్కడ పోటీకి దించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
అయితే.. ఇప్పటికైనా పార్టీ నియోజకవర్గ పగ్గాలు తనకు అప్పగిస్తారని ఆయన భావించారు. కానీ మళ్లీ విడదల రజినికే ఛాన్స్ ఇచ్చారు జగన్. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మర్రి ఇక పార్టీ వీడడమే బెస్ట్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఆయనతో మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే మరికొన్ని రోజుల్లోనే ఆయన టీటీడీ కండువా కప్పుకునే అవకాశం ఉందని నియోజకవర్గంలో చర్చ సాగుతోంది.