Union Budget 2024: దిద్దుబాటు చర్యలు లోపించిన నిర్మలా సీతారామన్ బడ్జెట్

మొత్తం బడ్జెట్ కేటాయింపులు గత ఏడాది బడ్జెట్ కన్నా 7.1 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కన్నా 1 శాతం మాత్రమే ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర అన్నారు. దానితో చెప్పుకోదగిన మార్పులు చేసే అవకాశం లేదన్న అభిప్రాయపడ్డారు.

New Update
Union Budget 2024: దిద్దుబాటు చర్యలు లోపించిన నిర్మలా సీతారామన్ బడ్జెట్

వచ్చే ఐదేళ్లలో ఊహించని మార్పులు చేయబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెబుతూ వచ్చారు. 2047 నాటికి భారత్ ను అగ్రరాజ్యంగా చేసేందుకు బలమైన పునాది వేసే విధంగా బడ్జెట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఏ వర్గం వారిని కూడా సంతృప్తి పరచలేని విధంగా తాజా బడ్జెట్ కనిపించింది. లోక్ సభ ఎన్నికలలో 400 సీట్ల కళాభగ్నమై, కనీసం సొంతంగా పూర్తి మెజారిటీ సాధించక, ప్రభుత్వ మనుగడకు ఆధార పడిన బీహార్, ఆంధ్ర ప్రదేశ్ లలోని ప్రాంతీయ పార్టీల మెప్పు పొందే ప్రయత్నం తప్పా.. బడ్జెట్ తయారీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు లేవు.

సాధారణంగా ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఓటర్లను ఆకర్షించే విధంగా జనాకర్ష పథకాలను ప్రకటిస్తుంటారు. కానీ గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో అటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం జమా, ఖర్చులను సరిపెట్టుకొనే ప్రయత్నమే చేశారు. ఎన్నికలలో పూర్తి మెజారిటీ రాకపోవడానికి కారణమైన నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, వ్యవసాయ రంగంలో సంక్షోభం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలత వంటి అంశాలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తారు అనుకొంటే అటువంటి ప్రయత్నం కూడా జరిగినట్లు లేదు.

మొత్తం బడ్జెట్ కేటాయింపులు గత ఏడాది బడ్జెట్ కన్నా 7.1 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కన్నా 1 శాతం మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. దానితో చెప్పుకోదగిన మార్పులు చేసే అవకాశం లేదు. వ్యవసాయంకు ప్రాధాన్యత ఇస్తూ రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. గత ఏడాది కన్నా 8.6 శాతం ఎక్కువ కన్నా, వోట్ ఆన్ అకౌంట్ కన్నా 4 శాతం ఎక్కువ. అయితే అందులో అత్యధిక భాగం పీఎం కిసాన్ యోజన కిందనే సరిపోతుంది.

ఉపాధి, స్కిల్ అభివృద్ధి పట్ల ప్రాధాన్యత ఇస్తూ అనేక పథకాలు ప్రకటించినా ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా తయారీ రంగంలో పెరిగేందుకు తీసుకున్న చర్యలు కనిపించవు. స్కిల్ శిక్షణ పొందిన అనేకమంది నిరుద్యోగులుగానే మిగిలిపోతూ ఉండటాన్ని చూస్తున్నాము. అవసరమైన ఉపాధి అవకాశాలు పెరగాలి. కానీ కాపిటల్ ఆధారిత ఉత్పత్తి పెంపు పట్లనే దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ రంగంలో నిస్తేజం నెలకొన్నా గ్రామీణ ఉపాధి హామీ పథకంకు నిధులు పెంచక పోగా, స్వల్పంగా తగ్గించారు. పైగా, కేటాయించిన నిధులను సహితం పూర్తిగా ఖర్చు పెట్టడం లేదు.

కీలకమైన విద్య, ఆరోగ్య రంగాలలో చెప్పుకోదగిన కేటాయింపులు కనిపించడం లేదు. వాస్తవానికి కరోనా అనంతరం సాధారణ ప్రజానీకంపై ఆరోగ్య రంగాన్ని దగ్గరగా చేర్చవలసిన అవసరాన్ని గుర్తించినట్లు లేదు. ఆరోగ్యంపై వ్యయం తగ్గించారు. 70 ఏళ్ళు దాటినా వారందరినీ ఆయుష్మాన్ భారత్ పధకం కిందకు చేరుస్తామని ప్రకటించారు కానీ, ఆ విషయాన్ని బడ్జెట్ లో ప్రస్తావించలేదు. విద్యారంగానికి నామమాత్రంగా మాత్రమే కేటాయింపులు పెంచారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లు అంకెల గారడీకి ప్రతీకగా ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన గణాంకాలు లేకపోవటమే కారణం. అందుకనే డేటా సేకరణకు ప్రాధాన్యత ఇస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. కానీ 2021 నుండి ఆగిపోయిన జనాభా గణాంక సేకరణ గురించిన ప్రస్తావన బడ్జెట్ లో చేయనే లేదు. ఇప్పట్లో చేసే అవకాశం కనిపించడం లేదు.

రూఫ్ టాప్ సోలార్ ఇంధనం గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకొంటుంది. బలహీన వర్గాలు, ఉద్యోగ వర్గాలు, గ్రామీణ ప్రజలకు ఈ పధకం ఏమేరకు ప్రయోజనం చేకూరుతుందో చెప్పలేము. కానీ పక్కా గృహాలు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. దేశంలో సంపద పెరుగుతున్నా ఆర్థిక తారతమ్యాలు పెరుగుతూ వస్తున్నాయి. మిలియనీర్లు పెరుగుతున్నారు కానీ సాధారణ ప్రజల ఆదాయం పెరగడం లేదు. ఈ విషయమై ప్రభుత్వం నోరుమెదపడం లేదు.

దేశ ప్రజలు ద్రవ్యోల్భణం సమస్యను ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు, కూరగాయల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు సహితం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికలలో బిజెపిపై ఆ పార్టీకి సాంప్రదాయ మద్దతుదారులైన మధ్యతరగతి ప్రజలు తిరుగుబాటు చేసేందుకు ఇదే ప్రధాన కారణం. బడ్జెట్ లో ద్రవ్యోల్భణం గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవు.

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ మనుగడకు కీలక మద్దతు దారులైన టిడిపి, జెడియు తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కోరుతున్నాయి. అయితే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఆ రెండు రాష్ట్రాలను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. దానితో మిగిలిన రాష్ట్రాల పేర్లు ఏవీ బడ్జెట్ లో ప్రస్తావించలేదని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిరసన వ్యక్తం చేస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

బీహార్ లో కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడ కొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లను ప్రకటించారు. వాటికి కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ విషయంలో మాటలు తప్పా నిజమైన సహాయం ఏమీ లేదని స్పష్టం అవుతుంది. అయినా, తమ రాష్త్రానికి కేంద్రం ఏదో పెద్దగా ఒరగబెట్టింది అన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉండటం విస్మయం కలిగిస్తుంది.

కొత్తగాఆ ఏర్పడే రాజధానుల నిర్మాణ బాధ్యత వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానిదే. అదేవిధంగా అమరావతి బాధ్యత కేంద్రందే. అయినా, 2014-19 మధ్య కేవలం రూ 1500 కోట్లు ప్రకటించి ఊరుకున్నారు. ఆ మొత్తాన్ని కూడా ఎప్పటికో విడుదల చేశారు. ఇప్పుడు రూ 60,000 కోట్లకు పైగా అవసరం ఉండగా రూ 15,000 కోట్లు ఈ ఏడాదికి ప్రకటించారు. కానీ, ఆ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు రుణంగా సమకూరుస్తామని చెబుతున్నారు.

గతంలో ఒకసారి ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణాన్ని తిరస్కరించింది. గత ఐదేళ్లుగా అక్కడ పనులు జరగడం లేదు. తిరిగి అంచనాలు, ప్రణాళికలు తయారు కావడానికి మరో మూడు నెలలైనా రాష్ట్ర ప్రభుత్వంకు పడుతుంది. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు రుణంకోసం ప్రయత్నం చేస్తే ఈ ఏడాది ఋణం లభించే అవకాశం ఉండదు. ఆ విధంగా కాకుండా, కేంద్ర ప్రభుత్వం ముందుగా తాము ఆ మొత్తం సర్దుబాటు చేస్తాం అని కూడా చెప్పడం లేదు.

ఇక పోలవరం విషయంలో నిర్మాణ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వందే. 2013లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త భూసేకరణ చట్టం కారణంగా నిర్మాణ అంచనాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడెనిమిదేళ్ళుగా సవరించిన నిర్మాణ అంచనాలను కేంద్రం ఆమోదించడం లేదు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసినా ఆర్ధిక శాఖ పట్టించుకోవడం లేదు. ఈ ప్రాజెక్ట్ లో కీలకమైన నిర్వాసితుల పునరావాసంతో తమకు సంబంధం లేదన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నది. ఈ అంశాలపై స్పష్టమైన విధానాలు ప్రకటించకుండా పోలవరంకు సహాయం చేస్తామని ఆర్థిక మంత్రి యధాలాపంగా ఓ మాట చెబితే సరిపోదు.

అదే విధంగా పారిశ్రామిక మండలులు ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలోకి వచ్చినవి కావు. పలు సంవత్సరాలుగా వాటి గురించి కేంద్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ కు ఉదారంగా కేంద్రం నిధులు సమకూరుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో అర్ధం లేదని చెప్పవచ్చు. మచిలీపట్టణం వద్ద ప్రతిపాదిస్తున్న ఆయిల్ రిఫైనరీ సహితం ప్రభుత్వ రంగ సంస్థ సారథ్యంలో ఆదానీలకు కట్టబెట్టే ప్రయత్నంగా ప్రచారం జరుగుతుంది.

కనీసం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ లకు సహితం ఈ బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాలలో గెలుపొందడం నరేంద్ర మోదీ నాయకత్వంకు సవాల్ వంటిది. అయినా, పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది.

మొత్తం మీద బడ్జెట్ లో అంకెలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లు ప్రసంగాలు, వచ్చే ఐదేళ్లలో చేయబోయే పనుల గురించి ఎక్కువగా ఆర్ధిక మంత్రి ప్రస్తావించినట్లు స్పష్టం అవుతుంది. భారత్ ను మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దబోతున్నట్లు ప్రధాని తరచూ చెబుతూ వస్తున్నారు. అయితే దేశంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, కీలక రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ఈ ప్రభుత్వం వద్ద నిర్దుష్టమైన ప్రణాళికలు లేవని ఈ బడ్జెట్ స్పష్టం చేస్తుంది.

పైగా, రెండు తరం ఆర్ధిక సంస్కరణలకు ఎన్నికల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రధాని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు బిజెపికి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సంస్కరణలు వెనకడుగు వేస్తున్నట్లు ఈ బడ్జెట్ తీరుతెన్నులు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో రైల్వేల భద్రత వెనకడుగు వేస్తున్నట్లు వరుసగా జరుగుతున్న ప్రమాదాలు స్పష్టం చేస్తున్నాయి. రైల్వేలను ప్రైవేట్ పరం చేయడం, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా చేయడం జరుగుతుందనే విమర్శలు తలెత్తుతున్నాయి.

ఎంఎస్ఎంఈ లను ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం నిర్మల సీతారామన్ తన ప్రసంగంలో చేసినా వాస్తవంలో ప్రభుత్వ విధానాలు వారిని తీవ్రంగా కుంగదీస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల విధానాలు వారి పట్ల శాపంగా మారుతున్నాయి. తాము తీనుకున్న రుణాలకన్నా ఎక్కువ విలువగల ఆస్తులను హామీలుగా ఉంచుతున్నారు. కేవలం ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన బిల్లులతో తీవ్ర జాప్యం జరుగుతూ ఉండడంతో సకాలంలో వాయిదాలను చెల్లించలేకపోతే నిర్దాక్షిణ్యంగా వారి కంపెనీలను వేలం వేస్తున్నారు. కానీ కార్పొరేట్ రంగం పట్ల మాత్రం ఉదారంగా వ్యవహరిస్తున్నారు.

సహజంగానే, 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పటికీ చెప్పుకోదగిన కేటాయింపులు ఆ పార్టీకి బడ్జెట్ లో కనిపించక పోవడం క్షేత్రస్థాయిలో ఇబ్బందికర పరిణామమే. కేంద్ర పన్నుల్లో రాజ్యాంగబద్ధంగా దక్కవలసిన వాటాలనే కేంద్రం ఉదారంగా చేస్తున్న సహాయంగా బిజెపి నేతలు ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి కలిగిస్తున్నది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన ఒడిశాలో సైతం బీజేపీ ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటున్నది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు