ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతోన్న ప్రతిష్టంభన.. ఇప్పటివరకు ఎటూ తేల్చని గవర్నర్..!

టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ బిల్లుపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఎటూ తేల్చలేదు. ఇవాళే (ఆగస్టు 6) అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో సెషన్‌ ముగిసేలోపు బిల్లుపై క్లారిటీ వస్తుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ గవర్నర్‌ నుంచి ఇవాళ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోతే సమావేశాలు రేపటి వరకు పొడిగిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

New Update
ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతోన్న ప్రతిష్టంభన.. ఇప్పటివరకు ఎటూ తేల్చని గవర్నర్..!

లాస్ట్‌ ఓవర్‌ వచ్చేసింది.. ప్రభుత్వం తన ఆట షురూ చేసింది.. సిక్సులు, ఫోర్లు కొట్టేందుకు రెడీ అయ్యింది.. ఇంతలోనే అంపైర్‌(గవర్నర్) నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు.. లైట్‌ ఫెయిల్‌ అయిందని.. ఇలా చికటిలో ఆడడం కరెక్ట్ కాదని.. ఫ్లడ్‌ లైట్స్‌ వేసే వరకు గేమ్‌ ఆపాలని ఝలక్‌! సీన్ అర్థమైంది కదా..! ఆర్థికపరమైన ఏ బిల్లు అయినా గవర్నర్‌ ఆమోదం తప్పనిసరి. టీఎస్‌ఆర్టీసీ(TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై(Tamilisai) సంతకం మస్ట్! ఈ నెల 2నే ఈ బిల్లును రాజ్‌భవన్‌(Raj Bhavan)కి పంపింది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల సమయంలో బిల్లును పాస్‌ చేయాలని ప్రభుత్వం భావించింది. మూడు రోజుల సమావేశాల కాస్త నాలుగో రోజుకు మారాయి కానీ ఇప్పటివరకు బిల్లు అటు, ఇటు, ఎటు కదలలేదు. బిల్లుపై తనకున్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకునే పనిలో పడ్డారు తమిళిసై. గవర్నర్‌ సందేహలకు ప్రభుత్వం ఎంతో ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్నట్టే కనిపిస్తుంది.. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది..? ఇవాళైనా బిల్లుపై ఓ క్లారిటీ వస్తుందా?

చివరి రోజు సమావేశాలపై ఉత్కంఠ:
ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో టీఎస్‌ఆర్టీసీ బిల్లు గులాబీ సర్కార్‌కు ఎంతో కీలకం. అందుకే గవర్నర్‌పై కస్సుబుస్సుమనకుండా సంతకం కోసం తమిళిసై ఏం అడిగినా చేస్తుంది. ముందుగా బిల్లుపై తనకు ఐదు సందేహాలు ఉన్నాయని చెప్పిన గవర్నర్‌.. ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత మరో మూడు ప్రశ్నలను సంధించారు. ఇక ఈ మూడిటికి ఆన్సర్ ఇచ్చిన తర్వాతైనా తమిళిసై బిల్లుకు ఆమోదం చెబుతారా అంటే ఏమో ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. భవిష్యత్‌లో ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా ఉండటం కోసమే తాను సందేహాలు నివృత్తి చేయాలని అడిగినట్టు తమిళిసై చెబుతున్నారు. ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగి, కార్మికుడి హక్కులు కాపాడటమే తన ఉద్దేశమంటున్నారు. అంతేకానీ బిల్లుకు రాజ్‌భవన్ అడ్డుపడటం లేదని క్లారిటీ ఇస్తున్నారు.

ఇవాళ ఏం జరుగబోతోంది?
టీఎస్‌ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం చెప్పకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి వరకు కొనసాగనున్నాయి. మరి ఈ రోజు సమావేశాలు ముగిసే టైమ్‌ వరకు కూడా తమిళిసై నుంచి ఎలాంటి స్పష్టత లేకపోతే పరిస్థితి ఏంటి? రేపటి వరకు సమావేశాలను పొడిగిస్తారా? ఏది ఏమైనా బిల్లు పాస్‌ అయ్యేవరకు ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. అటు గవర్నర్ సైతం తన సందేహాలను నివృత్తి చేసుకునే వరకు ఆమోదించే ప్రసక్తే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇటు ఆర్టీసీ కార్మికులు నిరసనలు ఆపడం లేదు. ముందు సంతకం తర్వాతే చర్చలు అని తెగేసి చెబుతున్నారు. మరి లాస్ట్ ఓవర్‌లో ఏం జరుగుతుందన్నది మ్యాచ్‌ ముగిస్తే కానీ చెప్పలేం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు