Trolling Trouble: ట్రోలింగ్ కిల్లింగ్..సైకోలుగా మారుతున్న సోషల్ మీడియా ఎడిక్ట్స్!

సోషల్ మీడియాలో ట్రోలింగ్ భూతం అమాయకులను మింగేస్తోంది. సామాన్యులకు చావు డప్పు మోగిస్తున్నారు సోషల్ మీడియా సోమరిపోతులు. విచక్షణారహితంగా.. అసభ్యకరంగా.. ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్న ట్రోలింగ్ సైకోలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాల్ని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది. 

New Update
Trolling Trouble: ట్రోలింగ్ కిల్లింగ్..సైకోలుగా మారుతున్న సోషల్ మీడియా ఎడిక్ట్స్!

Trolling Trouble: టెక్నాలజీ పెరగడం అంటే అభివృద్ధికి ఆసరాగా నిలబడటం. దాని ఆధారంగా మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడం. అయితే, ప్రస్తుతం మాత్రం టెక్నాలజీ ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తిని ఆడుకోవడం.. తోటి మనుషులను దారుణంగా మానసికంగా హింసించడంగా మారిపోయింది. టెక్నాలజీ మార్పు హింసించడానికి ఉపయోగించుకోవడం అనేది చాలా సాధారణంగా అయిపొయింది. సమాచార విప్లవం అంటే.. మనిషిని మనిషిని దగ్గర చేసేదిలా ఉండాలి. మనుషుల మధ్య దూరాల్ని దారంలా కలిపేలా ఉండాలి. కానీ, ఇప్పుడు కొంతమంది దానిని మాటల విరుపులతో.. పదాల హింసాత్మక ప్రయోగాలతో.. నోటితో మాట్లాడటానికి కూడా అసహ్యించుకునే పదాల్ని విచ్చలవిడిగా అవతల వారిపై ప్రయోగించడం కోసం వాడుతున్నారు. సున్నిత మనస్కుల మరణాన్ని హ్యాష్ టాగ్స్ తో తీసుకువస్తున్నారు. ట్వీట్ ల బురద.. ఇన్స్టా వరదతో పరువు మునిగిపోతుంటే, బాధితులు చావు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసేస్తున్నారు. తాజాగా తెనాలి గీతాంజలి అనే యువతి ట్రోలింగ్ భూతం (Trolling Cancer)పెట్టిన హింసతో రైలు కింద పది నిండు జీవితాన్ని బలిచేసుకుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనకు తెలీని ఇలాంటి సంఘటనలు ఎన్నో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. 

కాదేదీ కవిత కనర్హం అని మహాకవి అన్నాడు. కానీ, ఇప్పటి కుహానా మేధావులు కాదెవరూ ట్రోలింగ్ కు(Trolling Cancer) అనర్హం అని నిరూపిస్తున్నారు. ఉచితాల్ని వాడుకోవడం అలవాటు పడ్డ సోమరుల గుంపు అరచేతిలో ఉన్న ఫోన్ తో ఏది పడితే అది.. ఎలా పడితే అలా చిత్తానికి పెంటను సోషల్ మీడియాలో జల్లేస్తున్నారు. పార్టీల అండ.. నేతల దన్ను.. మనల్ని ఎవడేం చేస్తాడు అనే తెంపరితనంతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ఈ సోషల్ సోమరుల బారిన పడని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాబోదు. ఇప్పుడు గీతాంజలి విషయం బయటకు వచ్చింది. ఒక సామాన్యురాలి బాధ ప్రపంచానికి అర్ధం అవుతోంది. ఇలా బయటకు రాని గీతాలు ఎన్ని ఉన్నాయో? భాషను ఇలా కూడా వాడొచ్చా అని అనిపించేంతగా ఈ సోషల్ సోమరుల పదాలు ఉంటాయి. అసలు ఈ ట్రోలింగ్ భ్రష్టులకు(Trolling Cancer) ఒక అంశం.. ఒక విధానం ఏమీ ఉండవు. ఒక ప్రవచనకారుడు రామాయణం గురించి మాట్లాడుతూ అందులో ఒక అంశాన్ని చెబితే.. దానిని కులంతోనో.. సమాజంలోని ఒక వర్గంతోనో ముడిపెట్టి రచ్చ రచ్చ చేసి సదరు ప్రవచనకర్త ఎందుకొచ్చిన బాధ.. ఇంట్లో కూచుంటే మంచిది అనుకునేంతగా బాధపెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. గ్రంథాలన్నీ ఔపాసన పట్టిన అటువంటి ఘనాపాటీలే ఇలాంటి ట్రోలర్స్ ను తట్టుకోలేక వాపోతే పాపం.. గీతాంజలి లాంటి వారు చావును వెతుక్కోవడం తప్ప మరేమీ చేయలేకపోవడమే దురదృష్టం. 

Also Read: జగనన్న ఇల్లు ఇచ్చాడని చెప్పడమే ఆమె చేసిన తప్పా..ట్రోలింగ్ కు బలైన యువతి?

ట్రోలింగ్ (Trolling Trouble)అనేది ఒక చీడలా ఇంకా చెప్పాలంటే ఒక క్యాన్సర్ లా వ్యాపించింది. క్యాన్సర్ కి కనీసం మందో మాకో వేసే విరుగుడు ఉంది.. కానీ, ట్రోలింగ్ కు అడ్డుకట్ట వేసే పరిస్థితి ఏమాత్రం లేదు. ఈ ట్రోలింగ్ రొచ్చుకు రూపాయి ఖర్చు కాదు. మాట విసరడం ఎంత ఉచితమో.. ఒక వ్యక్తిని ట్రోల్ చేయడం అంతే సులువు. అయితే, మాట విసిరితే గాలిలో కలిసిపోతుంది. కానీ.. సోషల్ మీడియా ట్రోలింగ్ లింకులతో సింక్ అయిపోయి.. నెట్టింట్లో ప్రపంచమంతా క్యాన్సర్ లా వ్యాపించేస్తుంది. క్యాన్సర్ ఒక మనిషిని నిర్వీర్యం చేస్తుంది. కానీ ఈ ట్రోల్ క్యాన్సర్ ఇప్పటి వారిని.. భవిష్యత్ తరాల్ని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే.. నిత్యం కెమెరాలు.. వందలాది మంది అభిమానుల మధ్య తిరిగే సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడి భోరుమన్న సందర్భాలు ఉన్నాయి. డిప్రెషన్ లోకి వెల్లిపోయిన పరిస్థితీ ఉంది. దీపికా పదుకొనే, సమంత ఇలా పేర్లు చెప్పుకుంటూ పొతే అసలు ట్రోలింగ్ బారిన పడని వారు ఎవరున్నారో అర్ధం కాని పరిస్థితి ఉంటుంది.  ఇది ఒక సామాజిక రుగ్మత అని చెప్పొచ్చు. సాధారణంగా జబ్బును తగ్గించుకోవాలని అందరం చూస్తాం. కానీ, ట్రోలింగ్ రోగాన్ని మాత్రం పెంచి పోషిస్తున్నారు కొందరు బడా బాబులు. అవును.. నాలుగైదేళ్లుగా రాజకీయ ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క చిన్న మాట ఎవరైనా మాట్లాడితే, ఆ మాట నచ్చకపోతే.. దారుణమైన పదాలతో ఒకరిని మించి ఒకరుగా రెచ్చిపోయి ట్రోలింగ్ మొదలు పెట్టేస్తారు. 

సోషల్ మీడియా ట్రోలింగ్ సోమరులను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. కంప్యూటర్ వాడే.. ఇంటర్నెట్ లో రకరకాలుగా పనులను నిర్వర్తించుకునే ప్రతి ఒక్కరికీ.. ఎవరికీ వారికి విచక్షణా జ్ఞానం ఉండాలి. మనం వాడుతున్న పదం.. ఎదుటివారి గుండెను ఎంత గాయం చేస్తుంది? అనే కనీస ఆలోచన ఉండాలి. ఎవరైనా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నచ్చకపోతే హుందాగా చెప్పొచ్చు. కానీ, పరమ అసహ్యకరమైన భాషతో.. అభ్యంతరకరమైన తిట్లతో ట్రోలింగ్ చేయడం అనేది ఎవరు చేసినా తప్పే. దానిని అందరూ ఖండించాల్సిందే. దీపికా, సమంత లాంటి సెలబ్రిటీలకు ట్రోలింగ్ (Trolling Cancer)మీద అవగాహన ఉంటుంది. వారు నిత్యం ఇలాంటివి ఎన్నో చూస్తారు. అయినా, వారు కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయేలా ట్రోల్ చేసిన పరిస్థితులు ఉన్నాయంటే ఈ ట్రోలింగ్ పాపుల పనితనం తెలుసుకోవచ్చు. ఇక అలాంటి సెలబ్రిటీల దగ్గర వైద్య సహాయం పొందేందుకు డబ్బు ఉంటుంది. వారు డిప్రెషన్ నుంచి బయటపడటానికి అవసరమైన వైద్య సహాయాన్ని పొందుతారు. కానీ, గీతాంజలి లాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి? వారు ఇలా ట్రోలింగ్ భూతాలకు బలి అయిపోవాల్సిందేనా? డబ్బిచ్చి సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకునే పార్టీలు, నాయకులు, సెలబ్రిటీలు అందరూ ఆలోచించండి. ట్రోలింగ్ క్యాన్సర్ ను అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేయాలి. మరో గీతాంజలి వార్తలు మీడియాలో కనబడకుండా ఉండాలంటే అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి ట్రోలింగ్ పై యుద్ధం మొదలు పెట్టాలి. 

Watch this interesting Video: 

Advertisment
Advertisment
తాజా కథనాలు