Nirmal: కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధం

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులోని గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్‌ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్‌ గ్రామాలను కోర్‌ ఏరియా వెలుపల ఉన్న ధర్మాజిపేటకు నెలరోజుల్లో తరలించనున్నారు. వీరి కోసం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

New Update
Nirmal: కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధం

Kawal Tiger Reserve: కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్‌ (Nirmal) జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్‌ గ్రామాలను కోర్‌ ఏరియా వెలుపల ఉన్న ఇదే మండలంలోని ధర్మాజిపేటకు ప్రజలను తరలించనున్నారు. ధర్మాజిపేటలోనే వారికి పునరావాసం కల్పించనుండగా.. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. అలాగే మైసంపేట, రాంపూర్‌ వాసుల్ని రాష్ట్ర ప్రభుత్వం తేదీ నిర్ణయించగానే నెల రోజుల్లోగా వారందిరినీ ధర్మాజిపేటకు తరలించనున్నట్లు అటవీశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే కవ్వాల్‌ నుంచి మరికొన్ని గ్రామాలను, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులోని పలు గ్రామాలను తరలించేందుకు అటవీశాఖ కసరత్తు చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి..
పెద్దపులుల (Tigers) కోసం గ్రామాల్ని రీలొకేషన్‌ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. పెద్దపులులు స్థిర నివాసం ఏర్పరచుకోవడం, వాటి సంచారానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు అటవీశాఖ కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. కవ్వాల్‌ కోర్‌ ఏరియాలో 37 గ్రామాలుండగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన మైసంపేట, రాంపూర్‌ గ్రామాల్ని తొలిదశలో రీలొకేషన్‌కు తీసుకున్నారు. ధర్మాజిపేట కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోనే ఉన్నా.. ఈ ప్రాంతం పెద్దపులులు ప్రధానంగా సంచరించే కోర్‌ ఏరియాకు వెలుపల ఉంటుంది. ఆ రెండు గ్రామాలకు దాదాపు 25 కి.మీ.ల దూరం. అయితే రక్షిత అటవీప్రాంతం కావడంతో 276.50 ఎకరాల అటవీప్రాంతాన్ని డీనోటిఫై చేశారు. అందులో 6.88 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 5.48 ఎకరాలు సామాజిక అవసరాలకు, 264.14 ఎకరాలను వ్యవసాయభూమిగా పంచేందుకు కేటాయించారు. సామాజిక అవసరాల్లో భాగంగా - కమ్యూనిటీ సెంటర్‌, అంగన్వాడీ కేంద్రం, వాటర్‌ట్యాంకు, అంతర్గత రహదారులు వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు అటవీశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి : Hyderabad: గర్భిణి హత్యకేసులో నిందితులకు జీవిత ఖైదు

పెద్దపులుల సంచారం..
కవ్వాల్‌ కోర్‌ ఏరియాకు పెద్దపులులు వస్తున్నా జన సంచారం వంటి కారణాలతో కొద్దికాలానికే వెనక్కి వెళుతున్నాయి. మహారాష్ట్ర (Maharashtra) నుంచి కవ్వాల్‌ కోర్‌ (Kawal) ఏరియాకు వచ్చే మార్గమైన కారిడార్‌ ప్రాంతంలో 8-10 పులులు సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోర్‌ ఏరియా నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ చేపట్టారు. ‘మైసంపేట, రాంపూర్‌ గ్రామాల్ని ఖాళీ చేయించాక ఆ ప్రాంతాన్ని గడ్డిభూములుగా, నీటి వనరులుగా అభివృద్ధి చేస్తాం. దీంతో అక్కడ జింకలు వంటి శాకాహార జంతువులు పెరుగుతాయి. వీటిని వేటాడి ఆకలి తీర్చుకుంటూ పులులు ఇక్కడ స్థిరపడేందుకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో 26 పెద్దపులులు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ పెద్దపులులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా కోర్‌ నుంచి తరలించేందుకు 8 గ్రామాలు, చెంచుపెంటలను అటవీశాఖ గుర్తించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని ఫర్హాబాద్‌పెంట, కొల్లంపెంట, కుడిచింతలబైలు, సార్లపల్లి గ్రామాల్లో సామాజిక, ఆర్థిక సర్వే చేశారు. ఇక్కడ 380 కుటుంబాలున్నట్లు గుర్తించామని వెల్లడించారు.

పునరావాస పరిహారం..
ఇక ప్రాజెక్టు వ్యయం రూ.24.10 కోట్లు అవుతున్నట్లు ప్రకటించగా.. 2 గ్రామాల్లో 142 కుటుంబాలున్నాయని, ఇప్పటికే 48 కుటుంబాలకు ఆప్షన్‌-1 (పునరావాసం లేకుండా కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం) ఇవ్వగా, 94 కుటుంబాలు ఆప్షన్‌-2 (ఇంటి నిర్మాణంతో పాటు కుటుంబానికి 2.81 ఎకరాల భూమి) అందించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు