ఆధార్‌, పాన్ లింక్ కాకపోవడంపై కీలక ప్రకటన ఇచ్చిన ఐటీ శాఖ

ఆధార్, పాన్‌కార్డు లింక్‌పై కేంద్రప్రభుత్వం జూన్ 30 వరకు గడువును ఇచ్చింది. అయితే తాజాగా ఐటీ ఓ కీలక ప్రకటన చేసింది. చలానా చెల్లించి ఆధార్, పాన్ కార్డుని లింక్ చేసుకోవాలనుకున్నా గానీ ఆ ప్రక్రియ ఫెయిల్ అవుతుంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఐటీ శాఖ వెంటనే స్పందించింది.పాన్ లింక్ ప్రక్రియ పూర్తి కాకపోయినా.. దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఐటీ శాఖ పేర్కొంది.

New Update
ఆధార్‌, పాన్ లింక్ కాకపోవడంపై కీలక ప్రకటన ఇచ్చిన ఐటీ శాఖ

telugu-news-news-national-it-department-key-announcement-on-aadhaar-pan-link

ఆధార్ తో పాన్ కార్డుని అనుసంధానం చేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం, కొత్త బ్యాంక్ ఖాతా తీసుకోవడం, పెద్ద పెద్ద లావాదేవీలు జరపడం, ఆస్తులను కొనడం, రుణాలు తీసుకోవడం ఇలా చాలావాటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు దఫాలుగా పాన్, ఆధార్ లింక్ గడువు తేదీని పొడిగిస్తూ వచ్చిన కేంద్రప్రభుత్వం 2023 జూన్ 30న ఆఖరు తేదీగా ప్రకటించింది. ఆ గడువు తేదీలోపు అనుసంధానం చేయని పాన్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. ప్రస్తుతం ఆధార్ తో అనుసంధానం అవ్వని పాన్ కార్డులు నిలిచిపోయాయి. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులను అనుసంధానం చేసుకోవాలి.

80 ఏళ్ళు పైబడిన వృద్ధులకు మినహాయింపు ఉంటుంది. ఇప్పుడైనా సరే ఆధార్, పాన్ కార్డులను అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈఫైలింగ్ వెబ్ సైట్ లోకి వెళ్లి చలానా నంబర్ ఐటీఎన్ఎస్ 280 కింద రూ. 1000 పెనాల్టీ చెల్లించి చేసుకోవచ్చు. అయితే కొంతమంది పెనాల్టీ చెల్లించినప్పటికీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం జరగలేదు. పెనాల్టీ చెల్లించినా కూడా చలానా డౌన్లోడ్ అవ్వడం లేదు. దీంతో చాలా మంది తమ పాన్ కార్డులు ఇక చెల్లవేమో అని కంగారుపడుతున్నారు వినియోగదారులు. తాజాగా దీనిపై ఆదాయపన్ను శాఖ స్పందించింది. పాన్, ఆధార్ లింక్ ప్రక్రియ కోసం చెల్లింపు చేసిన తర్వాత చలానా డౌన్లోడ్ చేసుకోవడంలో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.

వినియోగదారులు చెల్లింపులు జరిపిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ఈ-పే ట్యాక్స్ సెక్షన్ లో చెల్లింపు పూర్తయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవచ్చునని వెల్లడించింది. అలానే పాన్, ఆధార్ అనుసంధానం కోసం చలానా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. చెల్లింపు పూర్తైన వెంటనే పాన్ కార్డు వినియోగదారుని రిజిస్టర్ మెయిల్ ఐడీకి చెల్లింపునకు సంబంధించిన రశీదు కాపీ వస్తుందని తెలిపింది. నగదు చెల్లింపు పూర్తైన తర్వాత కూడా ఆధార్, పాన్ లింక్ ప్రక్రియ పూర్తి కాకపోయినా.. దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఐటీ శాఖ పేర్కొంది. దీంతో వినియోగదారులకు కొంత ఊరటను కలిగించింది.

Advertisment