/rtv/media/media_files/2026/03/17/vaishu-ammu-2026-03-17-13-32-13.jpg)
జగిత్యాలలో దారుణం జరిగింది. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. అది కూడా తన భర్త చేతిలో. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిసి కూడా, కనీస కనికరం లేకుండా భర్త హరిబాబు ఆమెను కత్తితో నరికి చంపడం అందరినీ కలచివేస్తోంది.
కోరుట్ల అయ్యప్ప గుట్టకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ఏడాది కిందట లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆమె మేజర్ అయ్యే వరకు వేచి చూసి మరీ పెళ్లి చేసుకున్నాడు హరిబాబు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు, తమ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఏడు నెలల క్రితం ‘Vaishu Amma‘ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. ఇది అతి తక్కువ కాలంలోనే బాగా క్లిక్ అయింది. తక్కువ కాలంలోనే 48 వేలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్, వైష్ణవికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వారి హోం టూర్ వీడియోలు, వైష్ణవి గర్భవతి అయిన తర్వాత చేసిన షార్ట్ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.
అయితే కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా..శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన హరిబాబు, నాలుగు నెలల గర్భిణి అని కూడా చూడకుండా వైష్ణవిని కత్తితో దాడి చేసి చంపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఆదివారం ఉదయం ఎంతసేపటికీ వైష్ణవి గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా, ఆమె విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైష్ణవి ఇక లేదన్న వార్త తెలియగానే ఆమె ఛానల్ సబ్ స్క్రైబర్లు కూడా షాక్ కు గురవుతున్నారు.
అబార్షన్ చేయించుకోవాలని
వైష్ణవి గర్భం దాల్చినప్పటి నుండి అబార్షన్ చేయించుకోవాలని హరిబాబు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, దీనిపై గతంలో పంచాయితీ కూడా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం వైష్ణవి యూట్యూబ్ ఛానల్‌లో గతంలో పోస్ట్ చేసిన వీడియోలు చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ప్రాంక్ పేరుతో గతంలో భార్యాభర్తలు గొడవ పడుతున్నట్లు చేసిన వీడియోలన్నీ నిజమైన గొడవలేనా అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నిండు ప్రాణాన్ని, పుట్టబోయే బిడ్డను బలి తీసుకున్న ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Follow Us