/rtv/media/media_files/2025/10/04/tgsrtc-2025-10-04-20-17-25.jpg)
TGSRTC
RTC workers on strike : హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పిలుపుతో ప్రజా రవాణా వ్యవస్థపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో, నగర ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు వేగంగా పావులు కదుపుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుండి సమ్మె అమల్లోకి రావటంతో, బుధవారం ఉదయం నుండే 1000 బస్సులను ప్రత్యామ్నాయంగా సిద్ధం చేశారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద నడిచే 480 ఎలక్ట్రిక్ బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి. వీటి డ్రైవర్లు ఇప్పటికే ఔట్ సోర్సింగ్ విధానంలో ఉన్నందున సమ్మె ప్రభావం వీటిపై ఉండదు.
సుమారు 250 ప్రైవేట్ అద్దె బస్సులను వినియోగంలోకి తెస్తున్నారు.మరో 270 బస్సులను ఇతర విభాగాల నుంచి సేకరించి, ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లతో నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్లు ఉన్నప్పటికీ, కండక్టర్ల కొరత వేధించనుంది. దీనికోసం గతంలో నియామక ప్రక్రియలో ఎంపికై, జాబితాలో ఉండిపోయిన వారిని సమ్మె కాలంలో వినియోగించుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. అలాగే ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా కండక్టర్లను నియమించే యోచనలో ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం రవాణా అవసరాలు భారీగా ఉంటాయి. 1000 బస్సులతో నెట్టుకురావడం ఆర్టీసీకి పెద్ద సవాల్‌గా మారనుంది. నగరంలో నిత్యం నడిచే బస్సులు సుమారు 3,000 కాగా, సుమారు 26 లక్షల మంది రోజు వారి ప్రయాణం చేస్తారు.సమ్మె సమయంలో పరిస్థితిని మేనేజ్ చేయాలంటే కనీసం 2,000 బస్సులు అవసరమని అంచనా. కేవలం 1,000 బస్సులతో ట్రిప్పుల సంఖ్య పెంచినా, రద్దీని తట్టుకోవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. నగరంలో ప్రతిరోజూ 30 లక్షల మందికి పైగా ప్రజా రవాణాపై ఆధారపడుతున్నారు. ఆర్టీసీ సేవలు తగ్గడంతో మిగిలిన రవాణా వ్యవస్థలైన MMTS (60వేల మంది ప్రయాణికులు),మెట్రో (4.5 లక్షల మంది ప్రయాణికులు) పై విపరీతమైన ఒత్తిడి పెరగనుంది.
ఫలక్‌నుమా, నాంపల్లి, లింగంపల్లి, మేడ్చల్, చర్లపల్లి వంటి ప్రాంతాల నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను పెంచితే సబర్బన్ ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుంది.క్యాబ్‌లు, ఆటోలు: బస్సుల కొరతను సాకుగా చూపి ప్రైవేట్ క్యాబ్‌లు, షేర్ ఆటోలు అధిక ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. ఉదయం 8 నుండి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు ఉండే 'పీక్ అవర్స్'ను అదుపు చేయడం అధికారులకు కత్తిమీద సాము లాంటిదే.ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఉన్న మహిళలకు, సమ్మె వల్ల ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రభుత్వానికి పెద్ద సవాల్.
ఎల్బీనగర్, ఉప్పల్, ఐటీ కారిడార్ (హైటెక్ సిటీ, గచ్చిబౌలి), పటాన్‌చెరు, హయత్‌నగర్ వంటి బిజీ రూట్లలో బస్సుల అవసరం ఎక్కువగా ఉంటుంది.ఆర్టీసీ అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. సమ్మె తీవ్రతను బట్టి మరిన్ని ప్రైవేట్ వాహనాలను స్టేజ్ క్యారేజీలుగా నడిపేందుకు అనుమతించే అవకాశం ఉంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, మెట్రో లేదా ఎంఎంటీఎస్ సేవలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Follow Us