/rtv/media/media_files/2026/06/04/ameerpet-2026-06-04-16-58-28.jpg)
హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన అమీర్‌పేట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదం జరిగిన తీరు, దానికి గల కారణాలపై స్థానిక వ్యాపారుల మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది.
ఈ ప్రమాదానికి కారణం ఎవరనే విషయంలో హర్ష డీలక్స్ మెస్ యాజమాన్యానికి, పక్కనే ఉన్న హెల్మెట్ షాప్ యాజమాన్యానికి మధ్య పెద్ద గొడవ నడుస్తోంది. అమీర్‌పేట్‌లోని ఇతర షాపుల ఓనర్లు కూడా ఈ ప్రమాదానికి హర్ష డీలక్స్ మెస్ నిర్లక్ష్యమే కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
హర్ష మెస్ కిచెన్ లోపల విపరీతమైన వేడి వస్తుంటుందని, ఆ వేడి తట్టుకోలేక అక్కడి ఎక్జాస్ట్ ఫ్యాన్ ఒక్కసారిగా పేలిపోయిందని చెబుతున్నారు. ఆ ఫ్యాన్ పేలడం వల్లే మంటలు పక్కనే ఉన్న షాపులకు వేగంగా చుట్టుముట్టాయని అంటున్నారు. అంతేకాదు, ఇటీవల గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో.. ఖర్చు తగ్గించుకోవడానికి మెస్ సిబ్బంది సిలిండర్లకు బదులు కట్టెల పొయ్యిని వాడుతున్నారని, ఆ కట్టెల పొయ్యిల వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ మెస్‌లో ఒక చిన్న అగ్నిప్రమాదం జరిగిందని స్థానిక వ్యాపారులు గుర్తు చేస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలన్నింటినీ హర్ష మెస్ యాజమాన్యం గట్టిగా ఖండిస్తోంది. కట్టెల పొయ్యి వల్లే ప్రమాదం జరిగిందనే మాటల్లో నిజం లేదని వాదిస్తోంది. గతంలో చిన్న ప్రమాదం జరిగిన మాట వాస్తవమే అయినా.. ఈసారి మాత్రం తమ వల్ల ప్రమాదం జరగలేదని చెప్తోంది.
కాగా ఈ ప్రమాదంలో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. చూస్తూ చూస్తూనే దాదాపు 20 షాపులకు మంటలు అంటుకుని లోపల ఉన్న సామాన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా సుమారు 3 నుండి 5 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. వ్యాపారులు తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారు.
దట్టమైన పొగలు రోడ్డుపైకి
అమీర్‌పేట్ మెయిన్ రోడ్డు పక్కనే ఈ ప్రమాదం జరగడంతో, దట్టమైన పొగలు రోడ్డుపైకి అలుముకున్నాయి. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో 3 ఫైరింజన్లు, 8 వాటర్ ట్యాంకర్లను రప్పించి రాత్రి పగలు శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని అసలు నిజాలు ఏంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us