/rtv/media/media_files/2025/05/04/1Bx1iN5cAaCU2fG7zlHL.jpg)
Vijay Devarakonda - Rashmika
The Deverakonda Foundation : టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి తమ ఉదారతను చాటుకుంటూ సమాజ సేవలో ముందున్నారు. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ నూతన దంపతులు, తమ పెళ్లి రిసెప్షన్, ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతం సందర్భంగా ఒక కలల ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్కరి చదువూ ఆగిపోకూడదనే ఉన్నత ఆశయంతో, ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తామని నాడు వారు హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తాజాగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
We are on our way to Thummanpet.
— Vijay Deverakonda (@TheDeverakonda) June 14, 2026
The little village where my Father was born.
In February - @iamRashmika and I had announced the beginning of a little dream of ours.
To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana.
Here is a… pic.twitter.com/wLNSr4ZZHe
ఈ హామీ నెరవేర్పులో భాగంగా విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మికతో కలిసి, తన తండ్రి పుట్టిన సొంత ఊరైన నాగర్‌కర్నూల్ జిల్లా, బాల్మూర్ మండలం తుమ్మన్‌పేట గ్రామానికి విచ్చేశారు. పెళ్లి తర్వాత మొదటిసారిగా రష్మికతో కలిసి సొంతూరికి వచ్చిన విజయ్, అక్కడ నూతనంగా నిర్మించిన గృహంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ముచ్చటించిన విజయ్.. గ్రామాభివృద్ధిపై, స్థానిక విద్యార్థుల ఉన్నత చదువులపై తనకున్న ఆలోచనలను, ప్రణాళికలను వారితో పంచుకున్నారు. తమ ఊరి బిడ్డ స్టార్ హీరో అయి, పెళ్ళైన తర్వాత భార్యతో కలిసి గ్రామానికి రావడంతో స్థానికులు వారికి బ్రహ్మరథం పట్టారు.
‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా 2026 విద్యా సంవత్సరానికి గానూ అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యార్థుల కోసం ప్రత్యేక ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్’ కార్యక్రమాన్ని ఈ దంపతులు అధికారికంగా ప్రారంభించారు. ఈ డివిజన్‌లోని మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ స్కాలర్‌షిప్‌ల కోసం ఎంపిక చేశారు. కష్టపడి చదివి, పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన మొత్తం 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల (Merit Students) జాబితాను ఫౌండేషన్ అధికారికంగా విడుదల చేసింది.
ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం కింద ఎంపికైన 180 మంది విద్యార్థుల చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తామే భరిస్తామని విజయ్-రష్మిక దంపతులు భరోసా ఇచ్చారు. విజయ్ సొంత గ్రామానికి చెందిన జడ్పీహెచ్‌ఎస్ తుమ్మన్‌పేట పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్), అలాగే 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) ఈ స్కాలర్‌షిప్ సాధించిన వారిలో ఉన్నారు. విద్యార్థుల్లో ఉన్నత విద్యపై ఆసక్తిని పెంపొందించడం, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ రోజు(జూన్ 14న) జరిగే ప్రధాన కార్యక్రమంలో భాగంగా, ఎంపికైన విద్యార్థులందరికీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతుల చేతుల మీదుగా నేరుగా ఈ ఉపకారవేతనాలను అందజేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు విజయ్ దేవరకొండ తల్లిదండ్రులతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి (DEO), మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అచ్చంపేట నియోజకవర్గ విద్యార్థులకు ప్రోత్సాహాన్నివ్వడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు మరింత ప్రాధాన్యత చాటే ఒక గొప్ప వేదికగా ఈ కార్యక్రమం నిలవనుంది.
తమ కెరీర్‌తో ఎంతో బిజీగా ఉంటూనే, నాడు ఇచ్చిన మాటను మరువకుండా కార్యాచరణలోకి తెచ్చిన విజయ్-రష్మికల ఉదారతపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమ పిల్లల చదువులకు, భవిష్యత్తుకు కొండంత అండగా నిలిచిన ఈ సినీ దంపతులపై తుమ్మన్‌పేట గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు నెటిజన్లు సైతం ఈ రియల్ హీరో జోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ, వారి సామాజిక దృక్పథాన్ని కొనియాడుతున్నారు.
Follow Us