Tollywood : టాలీవుడ్ లో విషాదం... ప్రముఖ నటుడు, నిర్మాత చిట్టిబాబు మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (56) గుండెపోటుతో మంగళ వారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.  

New Update
FotoJet - 2026-04-22T065843.786

Chittibabu passes away

Tollywood : తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (56) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళ వారం రాత్రి చిట్టిబాబుకు హఠాత్తుగా గుండెపోటు (Cardiac Arrest) రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

 చిట్టిబాబు అసలు పేరు త్రిపురనేని వరప్రసాద్. సినీ రంగంలో 'చిట్టిబాబు'గా సుపరిచితులు.1970, జనవరి 1న కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో జన్మించారు. త్రిపురనేని మహారథి,హేమలత దంపతులకు జన్మించారు.ఆయనకు భార్య ,ఇద్దరు కుమారులు ఉన్నారు.

మహారథి తనయుడిగా..

చిట్టిబాబు తండ్రి త్రిపురనేని మహారథి తెలుగు చిత్రసీమలో దిగ్గజ రచయిత. ఎన్టీఆర్ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ వంటి చారిత్రక చిత్రాలకు ఆయన అందించిన సంభాషణలు, కథలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తండ్రి నుంచి వచ్చిన సాహితీ అభిలాషను, సినీ పరిజ్ఞానాన్ని చిట్టిబాబు పుణికిపుచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా గంభీరమైన పాత్రలను కూడా పోషించారు. సినిమా నిర్మాణంపై ఉన్న మక్కువతో నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, సినిమా నిర్మాణ వ్యయం, డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలపై లోతైన విశ్లేషణ చేసేవారు.

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA),ఇతర సినీ యూనియన్లలో ఆయన చాలా యాక్టివ్‌గా ఉండేవారు. తోటి కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండేవారు. ఇటీవలి కాలంలో చిట్టిబాబు ఒక సినీ విశ్లేషకుడిగా (Film Analyst) తెలుగు ప్రేక్షకుల మధ్య చర్చల్లో ఉండేవారు. సినిమాల విజయవకాశాలు, ట్రెండ్స్, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లపై టీవీ చర్చల్లో ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. ఆయన విశ్లేషణలు ఆలోచనాత్మకంగా,వాస్తవానికి దగ్గరగా ఉండేవని పరిశ్రమ వర్గాలు చెబుతుంటాయి.

పరిశ్రమ ప్రముఖుల సంతాపం

చిట్టిబాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని నటులు, నిర్మాతలు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.చిట్టిబాబు పార్థివ దేహానికి ఆయన నివాసంలో పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అంత్యక్రియలు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు.

Advertisment
తాజా కథనాలు