/rtv/media/media_files/2026/04/03/muncipal-2026-04-03-15-23-41.jpg)
Chairmen and Vice Chairmen : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్యాతనపల్లి సహా ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల ఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్ల ఎన్నికలు ఏప్రిల్ 4న నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ మూడు మున్సిపాలిటీల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఏవైనా కారణాలతో శనివారం ఎన్నిక వాయిదా పడితే మరుసరిరోజు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. నిజానికి ఫిబ్రవరి 16న రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని మున్సిపాల్టీల పాలకవర్గాల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించింది. అయితే క్యాతనపల్లి, ఖానాపూర్‌లో కోరంలేక వాయిదా వేయాల్సి వచ్చింది.
Also Read : రేవంత్ పోవాలి.. మార్పు రావాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వివాదస్పదమైన క్యాతనపల్లి
కాగా, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి(Kaytanapalli) మున్సిపాలిటీలో 22 వార్డులకు ఎన్నికలు జరగగా బీఆర్‌ఎస్- సీపీఐ కూటమి కలిసి 14 వార్డుల్లో గెలుపొందాయి. ఇక్కడ బీఆర్‌ఎస్ 10, సీపీఐ 4 వార్డులు గెలువగా, కాంగ్రెస్ 7 వార్డుల్లోనే గెలిచింది. అయితే చైర్ పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు జరగకుండా మంత్రి వివేక్ అడ్డుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ తరఫున మంత్రి వివేక్, ఆయన తనయుడు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకోవటంతో ఆ పార్టీ బలం తొమ్మిదికి చేరింది. ఫిబ్రవరి 17న నిర్వహించిన క్యాతనపల్లి ఎన్నికల్లో బీఆర్ఎస్-సీపీఐ కూటమితోపాటు కాంగ్రెస్ సభ్యుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకోగా ఎన్నిక మళ్లీ వాయిదాపడింది. ఈ ఘటనలో కేసులు నమోదైన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా తొమ్మిది మంది 14 రోజుల రిమాండ్‌కు వెళ్లటం రాజకీయ ప్రాధాన్యాన్ని రేకెత్తించింది. గొడవలు, కేసుల కారణంగా ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీనికి రేపు ఎన్నిక జరగనుంది.
ఖానాపూర్‌లో ఏం జరిగిందంటే?
ఖానాపూర్(Khanapur) మున్సిపాలిటీలో 12 స్థానాలుండగా బీఆర్‌ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3,ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ దీంతో చైర్ పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 7 స్థానాలు ఏ పార్టీకీ రాలేదు. ఇక్కడ ఖానాపూర్ ఎమ్మెల్యే ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా పేరు నమోదు చేసుకోవటంతో కాంగ్రెస్ బలం కూడా నాలుగుకు చేరింది. దీంతో ఎన్నిక తొలిరోజు ఫిబ్రవరి 16న కాంగ్రె స్ కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మిగిలిన పార్టీల సభ్యులు రాకపోవడంతో కోరం లేక మరుసటి రోజుకు ఎన్నిక వాయిదా పడింది. రెండో రోజు సైతం కాంగ్రెస్ మినహా బీఆర్‌ఎస్-బీజేపీ కౌన్సిలర్లు ఎవరూ కౌన్సిల్‌కు హాజరు కాలేదు. దీంతో రెండో రోజు సైతం ఎన్నిక వాయిదా పడింది. రెండు సార్లూ కోరం లేక ఎన్నిక వాయిదా పడటంతో తిరిగి ఏప్రిల్ 4న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక్కడ ఏ పార్టీకి పూర్తి స్థాయి అభ్యర్థులు లేకపోవడంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను ఏ పార్టీ దక్కించుకుంటుందనేది కీలకంగా మారింది. ఇక్కడ ఎవైనా రెండు పార్టీలు జతకట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇబ్రహీంపట్నంలో హైడ్రామా
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ(Ibrahimpatnam Municipality) ఎన్నిక సైతం రేపు జరగనుంది. ఇక్కడి మున్సిపాలిటీలో 24 వార్డులుండగా మ్యాజిక్ ఫిగర్ అయిన 13 వార్డులను బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అయినా ఒక స్వతంత్ర, బీజేపీ కౌన్సిలర్ కూడా మద్దతు ప్రకటించడంతో బీఆర్‌ఎస్ బలం 15కు చేరింది. దీంతో ఆరోజే ఎన్నిక నిర్వహించారు. చైర్ పర్సన్ ఎన్నిక కూడా పూర్తయ్యింది. ఇక కాంగ్రెస్ నుంచి 8 మంది కౌన్సిలర్లు గెలవగా, ఒక బీజేపీ కౌన్సిలర్, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియోతో కలిపి వారి బలం 10కి చేరింది. ఎన్నిక రోజు ఒక సభ్యుడు యాదగిరి సమావేశానికి రాలేదు. అతడ్ని కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేసింది. దీనికి కూడా రేపు ఎన్నిక జరగనుంది.
12,30 గంటలకు ఎన్నిక
కాగా ఈ మూడు మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏప్రిల్ 4న జరగనున్న ఎన్నిక ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా మొన్నటి ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థులకు ఏప్రిల్ 2న నోటీసులు జారీచేశారు. ఏప్రిల్ 4న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read : టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెడతా.. కవిత సంచలనం!
బీఆర్ఎస్ ఇన్ చార్జీల నియామకం
కాగా, మూడు స్థానాలు కూడా ఎలాగైన దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీనికోసం బీఆర్ఎస్ ముందు జాగ్రత్తగా మూడు స్థానాలకు ఇన్ చార్జీలను నియమించింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి ఎమ్మెల్యే లు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, క్యాతనపల్లికి మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఖానాపూర్ మున్సిపాలిటీకి మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌జాదవ్‌ను ఇన్‌చార్జులుగా నియమించారు.
Follow Us