/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-07-07-45.jpg)
10th Class Results 2026
10th Class Results 2026 : తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పరీక్షా ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. (ఈ రోజు) ఏప్రిల్ 29వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలు అధికారికంగా విడుదల కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా సమక్షంలో ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) కార్యాలయంలో ఈ ఫలితాలను వెల్లడించనున్నారు. తొలుత మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావించినప్పటికీ, మూల్యాంకన ప్రక్రియ వేగంగా పూర్తి కావడంతో ముందుగానే ఫలితాలను ప్రకటిస్తున్నారు.
మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,08,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2.50 లక్షల మంది ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారు కాగా, 2.07 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. మొత్తం 5.17 లక్షల మంది ఫీజు చెల్లించగా, పది వేల మందికి పైగా విద్యార్థులు సప్లిమెంటరీ అభ్యర్థులుగా పరీక్ష రాశారు. ఏప్రిల్ 23 నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు, 25వ తేదీ నాటికి స్కానింగ్ మరియు మార్కుల క్రోడీకరణ పనులను ముగించారు.
ఫలితాల వెల్లడి అనంతరం విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ సమస్యలు ఉన్నా లేదా సర్వర్లు బిజీగా ఉన్నా విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం 80969 58096 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపి, తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు ఫోన్ నంబర్ ద్వారా వివిధ వెబ్‌సైట్లలో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఫలితాలతో కుండిపోవద్దు..పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు అత్యంత కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. పదో తరగతి ఫలితాలు అనేవి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఒక చిన్న మలుపు మాత్రమేనని, మార్కులు మాత్రమే మనిషి భవిష్యత్తును లేదా జీవిత గమనాన్ని పూర్తిగా శాసించలేవని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు కేవలం అకాడమిక్ నైపుణ్యాన్ని కొలిచే సాధనాలే తప్ప, అవి విద్యార్థుల వ్యక్తిత్వానికి లేదా మేధస్సుకు కొలమానం కాదని గుర్తించాలని హితవు పలికారు. ఫలితాలు ఏవైనప్పటికీ విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఆశించిన మార్కులు రాకపోయినా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు.
ముఖ్యంగా విద్యార్థుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని సజ్జనార్ పేర్కొన్నారు. మార్కుల కోసం పిల్లలపై మితిమీరిన ఒత్తిడి చేయవద్దని, పిల్లల ప్రాణం కంటే గ్రేడ్లు ముఖ్యం కాదని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడం అంటే జీవితంలో ఓడిపోవడం కాదని, విఫలమైన చోటే తిరిగి పుంజుకుని విజయం సాధించే అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఏవైనా ప్రతికూల ఆలోచనలు వస్తే తక్షణమే ఆత్మీయులతో పంచుకోవాలని, జీవితం చాలా విలువైనదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
Follow Us