Ramachandra Rao : బండి సంజయ్ పై పార్టీకి ఇచ్చిన రిపోర్ట్ ఇదే.. RTVకి బీజేపీ చీఫ్ సంచలన ఇంటర్వ్యూ!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తన ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ప్రత్యేకంగా 'Rtv' తో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన వివాదంపై ఢిల్లీ పెద్దలు తనను ఏమీ అడగలేదని ఆయన స్పష్టం చేశారు.

New Update
FotoJet - 2026-05-23T194120.331

BJP chief Ramachandra Rao

Ramachandra Rao : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తన ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ప్రత్యేకంగా 'Rtv' ప్రతినిధితో మాట్లాడారు. హస్తిన పర్యటనలో అధిష్ఠానానికి సమర్పించిన నివేదికలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వివాదం, జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల సన్నద్ధతపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

 కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన వివాదంపై రామచంద్రరావు స్పష్టతనిచ్చారు. ఢిల్లీ పెద్దలు తనను బండి సంజయ్ విషయం గురించి ఏమీ అడగలేదని ఆయన స్పష్టం చేశారు. బండి భగీరథ్ ఇష్యూ అనేది పూర్తిగా ఒక కుటుంబ వ్యవహారమని, దీనికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రచార, ప్రసార సాధనాల్లో (మీడియా, సోషల్ మీడియా) వచ్చిన సమాచారం ఆధారంగా పార్టీ హైకమాండ్ దగ్గర ఈ ఇష్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చని, లేదా వారు స్వతంత్రంగా ఓ రిపోర్టు తెప్పించుకొని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. "కుటుంబంలో ఏదైనా తప్పు జరిగితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రస్తుతం కోర్టులో కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది, కాబట్టి దానిపై నేను ఎక్కువగా మాట్లాడకూడదు" అని పేర్కొన్నారు.

బండి సంజయ్ పేరు చెప్పి కావాలనే కొందరు పార్టీని బద్నాం (బ్లేమ్) చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవడం, పార్టీ పెరగడం ఓర్చుకోలేకనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ మా పార్టీకి కీలక నేత అని, ఆయనపై ఈగ వాలనియ్యమని, ఈ వివాదం వల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని రామచంద్రరావు భరోసా ఇచ్చారు. తన ఢిల్లీ పర్యటనలో పార్టీ సంస్థాగత విషయాలపై జాతీయ నాయకత్వానికి కీలక నివేదికలు సమర్పించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు.

ఇటీవల తెలంగాణలో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించిన పూర్తి సక్సెస్ రిపోర్టును అధిష్ఠానానికి అందజేసినట్లు చెప్పారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్‌ను కలిసి తెలంగాణలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయ పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదిక ఇచ్చానన్నారు. త్వరలో జరగబోయే తెలంగాణ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌కు (రాష్ట్ర కార్యవర్గ సమావేశం) హాజరుకావాల్సిందిగా పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ నితిన్ నబీన్‌ను ఆహ్వానించినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేదా సంఖ్య పెంచే అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, పార్టీలో ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలపై ఎలాంటి చర్చలు జరగవని స్పష్టం చేశారు.

రాబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలపై ఢిల్లీ పర్యటనలో కీలక చర్చలు జరిగాయని రామచంద్రరావు పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికలను పార్టీ పరంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు చెప్పారు.ఈ ఎన్నికల కోసం నియమించే ఇంచార్జీలపై అధిష్ఠానంతో చర్చలు జరిగాయని, జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం స్థానిక నేతలే కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక బీజేపీ నేతలను సైతం ఇన్ఛార్జీలుగా రంగంలోకి దించబోతున్నట్లు ఆయన లీక్ ఇచ్చారు.తెలంగాణ రాజకీయాలపై పార్టీ హైకమాండ్ చాలా సీరియస్‌గా ఉందని, రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వెళ్తామని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇకపోతే బీఆర్ఎస్ (BRS) పార్టీని నమ్మే స్థితిలో ప్రస్తుతం తెలంగాణ ప్రజలు లేరని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisment
తాజా కథనాలు