/rtv/media/media_files/2026/06/15/live-in-relationships-2026-06-15-09-49-13.jpg)
Live-in Relationships
Live-in Relationships : హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం విస్తరిస్తున్న కొద్దీ యువత జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే నగరంలో 'కో-లివింగ్' (సహ-నివాస) సంస్కృతి అనూహ్యంగా పుంజుకుంటోంది. ఒకప్పుడు కేవలం ఉద్యోగులు, విద్యార్థులు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి గదులను పంచుకునే పద్ధతిగా ప్రారంభమైన ఈ విధానం, నేడు యువతీ యువకులు పెళ్లి కాకుండానే ఒకే ఫ్లాట్‌లో లేదా గదిలో కలిసి ఉండే సరికొత్త ట్రెండ్‌కు వేదికగా మారుతోంది.
ముఖ్యంగా కోవిడ్ తదనంతర పరిస్థితులు, కార్పొరేట్ ఐటీ సంస్థలు ప్రవేశపెట్టిన హైబ్రిడ్ పని విధానం ఈ కో-లివింగ్ హాస్టళ్ల డిమాండ్‌ను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు రూ. 4 వేల కోట్లుగా ఉన్న ఈ వ్యవస్థీకృత మార్కెట్‌లో ఒక్క హైదరాబాద్ వాటానే సుమారు రూ. 750 కోట్లుగా ఉండటం గమనార్హం. నగరంలోని ఐటీ కారిడార్, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాలలో 400కు పైగా కో-లివింగ్ హాస్టళ్లు వెలిశాయి. వీటిలో ప్రస్తుతం 70 వేల మందికి పైగా నివసిస్తున్నారు.
సాధారణ వర్కింగ్ హాస్టళ్లతో పోలిస్తే ఈ కో-లివింగ్ స్పేస్‌లలో స్వేచ్ఛా వాతావరణం, మెరుగైన ప్రైవసీ లభిస్తుండటంతో యువత వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ డబుల్, త్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ల తరహా సదుపాయాలు ఉంటాయి. బెడ్‌రూమ్‌లు ఎవరికి వారు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ.. లివింగ్ రూమ్, కిచెన్, డైనింగ్, జిమ్, గేమింగ్ ఏరియా వంటివాటిని ఉమ్మడిగా వాడుకుంటారు. ఈ వసతుల కోసం ఒక్కొక్కరు నెలకు రూ. 12 వేల నుంచి రూ. 25 వేల వరకు చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు.
ఈ కో-లివింగ్ హాస్టళ్లలో నివసిస్తున్న వారిలో అత్యధికంగా 60 నుంచి 70 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాగా, మిగిలిన 30 నుంచి 40 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ఉంటున్నారు. ఒంటరితనానికి దూరంగా, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయని యువత అభిప్రాయపడుతోంది. పూర్తి భద్రత, సీసీటీవీ నిఘా, ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవలు ఉండటం వల్ల ముగ్గురు నలుగురు కలిసి విడిగా అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకునే కంటే ఇదే సురక్షితమైన మార్గమని భావిస్తున్నారు.
అయితే, ఈ ఆరోగ్యకరమైన కో-లివింగ్ కాస్తా క్రమంగా హద్దులు దాటి, పెళ్లి కాకుండానే అన్ని రకాలుగా కలిసి ఉండే 'సహజీవన (లివిన్ రిలేషన్‌షిప్)' సంస్కృతికి దారితీస్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మనసులు కలిసినప్పుడు కలిసి ఉండటంలో తప్పేముందని ఆధునిక యువత వాదిస్తోంది. పొరపచ్చాలు వస్తే పెళ్లయిన వారు విడాకులు తీసుకున్నట్లే, తాము కూడా బ్రేకప్ చెప్పుకుని విడిపోతామని చాలా మంది యువతీ యువకులు చాలా తేలికగా చెప్తున్నారు.
ఇలాంటి పద్ధతులను భారతీయ సమాజం, తల్లిదండ్రులు, సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యువత తాము రూమ్‌మేట్స్‌తో కలిసి ఉంటున్నామని తల్లిదండ్రులను నమ్మిస్తూ, తెరవెనుక సహజీవనం సాగిస్తున్న ఉదంతాలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇది కేవలం పాశ్చాత్య సంస్కృతి అనుకరణ మాత్రమేనని, మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు కుటుంబ వ్యవస్థల ఉనికికే ముప్పని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ స్వేచ్ఛా సంస్కృతి కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా తీవ్రమైన సామాజిక సమస్యలకు కారణమవుతోంది. కొన్ని చోట్ల ఈ కో-లివింగ్ ఫ్లాట్లు ఆల్కాహాల్, డ్రగ్స్ వంటి విచ్చలవిడితనానికి కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సాకుగా చూపి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటం, నమ్మించి మోసం చేయడం వంటి నేరాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
చివరికి ఈ సహజీవన సంబంధాలు విఫలమైనప్పుడు, ఇగో సమస్యలు లేదా విభేదాలు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. ఐటీ కారిడార్ పరిధిలో ఇటీవల కాలంలో నమోదవుతున్న కేసుల్లో ఇటువంటి లివిన్ రిలేషన్‌షిప్ గొడవలే ఎక్కువగా ఉంటున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన నైతిక, సామాజిక సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow Us