Drug racket : థాయ్‌లాండ్ టు ముంబై.. వయా హైదరాబాద్ ...అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

తెలంగాణ ‘ఈగల్’ ప్రత్యేక బృందం రెండు నెలల పాటు అత్యంత రహస్యంగా జరిపిన సుదీర్ఘ ఆపరేషన్‌తో ఒక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేసింది. థాయ్‌లాండ్ కేంద్రంగా సాగుతున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి, దీనితో సంబంధాలున్న ముంబై మాఫియా మూలాలను సైతం కదిలించింది.

New Update
FotoJet - 2026-06-05T092110.187

Hydroponic Ganja Smuggling Racket Busted Telangana Eagle Team

Drug racket : మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ ‘ఈగల్’ ప్రత్యేక బృందం రెండు నెలల పాటు అత్యంత రహస్యంగా జరిపిన సుదీర్ఘ ఆపరేషన్‌తో ఒక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును పూర్తిగా రట్టు చేసింది. థాయ్‌లాండ్ కేంద్రంగా సాగుతున్న ఈ భారీ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఛేదించి, దీనితో సంబంధాలున్న ముంబై మాఫియా మూలాలను సైతం కదిలించింది. దేశంలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ. 21 వేల జీతం ఇస్తామంటూ ఎర వేసి, వారి ద్వారా థాయ్‌లాండ్ నుండి ప్రతి ట్రిప్పుకు రూ. 10 కోట్ల నుండి రూ. 12 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన 'హైడ్రోపోనిక్ గంజాయి'ని భారతదేశానికి స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారాన్ని ఈగల్ టీమ్ బట్టబయలు చేసింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.

సాధారణ దేశీయ గంజాయిలో మత్తును ఇచ్చే ‘టీహెచ్‌సీ’ (టెట్రా హైడ్రో కానబినాల్) రసాయనం కేవలం 3 నుంచి 5 శాతమే ఉంటే, థాయ్‌లాండ్‌లో పండించే హైడ్రోపోనిక్ గంజాయిలో ఇది ఏకంగా 25 నుంచి 30 శాతం వరకు ఉంటుంది. విపరీతమైన మత్తును ఇచ్చే ఈ హైడ్రోపోనిక్ గంజాయికి భారతదేశంలోని ఉన్నత వర్గాల ప్రజలు అలవాటు పడుతుండటాన్ని ముంబై మాఫియా ముఠా క్యాష్ చేసుకుంది. ఇందులో భాగంగా థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో 'జల్వ క్లబ్'ను లీజుకు తీసుకుని భారీ పార్టీలు ఏర్పాటు చేసేవారని, వీటికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యేవారని విచారణలో తేలింది. ఈ పార్టీల ద్వారా భారతీయ కస్టమర్లను గుర్తించి, నేరుగా వారి ఇళ్లకే డ్రగ్స్ హోమ్ డెలివరీ చేస్తామంటూ పెడ్లర్లతో కలిసి పెద్ద నెట్‌వర్క్‌ను నడిపేవారు.

ఈ అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్‌కు ముంబైకి చెందిన హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు ఈగల్ బృందం గుర్తించింది. ఇతను తన తండ్రి ప్రమోద్, సోదరుడు సుధాంశులతో కలిసి పట్టాయాలో క్లబ్ నడుపుతూ ఈ దందాలోకి దిగాడు. ఈ ముఠాకు గతంలోనే రూ. 500 కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన  నేరచరిత్ర ఉంది. ఆ సమయంలో కస్టమ్స్ అధికారులకు పెనాల్టీ రూపంలోనే వీరు రూ. 60 కోట్లు చెల్లించారు. ఎర్రచందనం రవాణాలో ఉన్న పాత అనుభవాన్ని ఉపయోగించుకుని, 2023 నుండి రూటు మార్చి ఈ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్‌ను ప్రారంభించారు. ఈ గ్యాంగ్‌లో ముంబై మాఫియాకు చెందిన ఫెలిక్స్ లాంటి షార్ప్ షూటర్లతో పాటు కొరియా, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన విదేశీయులు కూడా భాగస్వాములుగా ఉండి, 'ఒరియంటల్ ప్లాంటేషన్ కంపెనీ' పేరిట విదేశాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. వీరి కోసం ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు.

ఈ ముఠా దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా నిరుద్యోగ యువతను 'ట్రాన్స్‌పోర్టర్లు'గా వాడుకుంటూ యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన సోదా మెహ్సిన్ బహదూర్ భాయ్ అనే వ్యక్తి లగేజీలో 13.2 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతనితో పాటు ఉండి తప్పించుకున్న హర్షద్ భాయ్ ప్రజాపతి సమాచారాన్ని ఈగల్ టీమ్‌కు అందించగా.. ఈ చిన్న టిప్ ఆధారంగా ఈగల్ ఫోర్స్ దేశవ్యాప్త వేట మొదలుపెట్టింది. ఈ విచారణలో హర్షద్, సందీప్ వాస్వానిలను అరెస్ట్ చేసి మరో 12.739 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 300 మంది ట్రాన్స్‌పోర్టర్ల సాయంతో వందల కిలోల డ్రగ్స్ రవాణా చేయగా, వారిలో 40 మందిని గుర్తించారు. ఆ 40 మందిలో 14 మంది తెలంగాణకు చెందిన యువకులే కావడం గమనార్హం; ప్రస్తుతానికి ఈ కేసులో 29 మందిని అరెస్ట్ చేశారు.

స్మగ్లింగ్ ద్వారా సంపాదిస్తున్న నల్లధనాన్ని వైట్ మనీగా మార్చడానికి ముంబైలో కస్టమ్స్ నోటిఫైడ్ షాప్ నడుపుతున్న మొహమ్మద్ ముస్తఫా ఇస్మాయిల్ అనే వ్యక్తి సహాయం తీసుకునేవారు. ఇతను స్మగ్లర్ల నుండి నగదు తీసుకుని థాయ్‌లాండ్‌లోని బినామీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవాడు, ఆ డబ్బునే తిరిగి గంజాయి సాగులో పెట్టుబడిగా పెట్టేవారు. ప్రధాన నిందితుడైన హేమాంగ్ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, హైఎండ్ కార్లలో తిరిగేవాడు. పోలీసులకు దొరక్కుండా ఉండటం కోసం కారు పెట్రోల్ బిల్లుతో సహా ఎక్కడా కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయకుండా కేవలం నగదు (క్యాష్) రూపంలోనే లావాదేవీలు జరిపేవారు. హైదరాబాద్‌కు చెందిన అక్బర్ ట్రావెల్స్ ద్వారా కేవలం నగదు ఇచ్చే కొన్ని వందల సార్లు బ్యాంకాక్ విమాన టికెట్లు బుక్ చేసుకున్నట్లు ఈగల్ టీమ్ ఆధారాలు సేకరించింది.

మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే, హేమాంగ్ తన ముఖ్య అనుచరులతో కలిసి ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించాడు. కోకాపేట ప్రాంతంలో సుమారు రూ. 25 కోట్ల నుండి రూ. 30 కోట్ల భారీ వ్యయంతో పట్టాయా తరహాలోనే ఒక విలాసవంతమైన 'జల్సా క్లబ్' ఏర్పాటు చేయడానికి స్థలాలను కూడా పరిశీలించాడు. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు వాడే స్కానర్లకు ఈ హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించడంలో కొన్ని పరిమితులు ఉండటాన్ని ఆసరాగా చేసుకుని వీరు భారీగా డ్రగ్స్ దిగుమతి చేస్తున్నారని డీజీ తెలిపారు. ప్రస్తుతం హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఈ ముఠాను పట్టుకున్నామని, త్వరలోనే పరారీలో ఉన్న మిగిలిన 11 మంది నిందితులతో పాటు ముఠాలోని ఇతర ముఖ్యులను కూడా వివిధ రాష్ట్రాల పోలీసుల సహకారంతో అరెస్ట్ చేస్తామని సందీప్ శాండిల్య స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు