/rtv/media/media_files/oum4u0T0hgBMYNJtmsdQ.jpg)
Telangana Restricts 500 Paddy Bonus to 7 Rice Varieties
Paddy Bonus : తెలంగాణలో వరి పండించే రైతాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీలో భాగంగా సన్న వడ్లకు ప్రకటించిన క్వింటాళ్లకు రూ.500 బోనస్‌ను ఇకపై కేవలం ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏడు రకాల సన్న వడ్లకే పరిమితం చేయాలని నిశ్చయించింది. మార్కెట్ అవసరాలు, దేశ విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను వ్యవసాయ శాఖ శాస్త్రీయంగా విశ్లేషించి, ఈ ఏడు ప్రత్యేక రకాల విత్తనాల జాబితాను విడుదల చేసింది. డిమాండ్ లేని రకాలను సాగు చేసి రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
బోనస్‌కు అర్హత సాధించిన ఆ 'ఏడు' వరి రకాలు
ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం.. బోనస్ చెల్లింపునకు అర్హమైనవిగా గుర్తించిన ఏడు రకాల విత్తనాలు ఇవే:
బీపీటీ-5204 (సాంబమసూరి)
ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా)
హెచ్‌ఎంటీ సోనా
జై శ్రీరామ్
కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నలు)
డబ్ల్యూజీఎల్-44 (సిద్ది)
కేఎన్‌ఎం-7715
ఈ నిర్ణీత రకాలను పండించే రైతులకే క్వింటాళ్లకు రూ.500 అదనపు ప్రోత్సాహకం లభించనుంది.
ఎన్నికల హామీల అమలు సమయంలో రాష్ట్రంలో దాదాపు 33 రకాల సన్న వడ్లు సాగవుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, వాటిలో చాలా రకాలకు మార్కెట్‌లో ఆశించిన ఆదరణ, డిమాండ్ లేవు. మిగిలిన 26 రకాల వడ్ల పరిమాణం ఎక్కువగా ఉండడం, మిల్లింగ్ చేసినప్పుడు నూక శాతం అధికంగా రావడం వల్ల ఎగుమతులకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. వినియోగదారులు కూడా వీటిని కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మద్దతు ధర దక్కక, మిల్లర్లు కొనక రైతులు నష్టపోతుండటంతో పాటు ప్రభుత్వానికి కూడా వృథా ప్రయాసగా మారుతోంది. అందుకే పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్ల సూచనల మేరకు 26 రకాలను జాబితా నుండి తొలగించారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ ఏడు వరి రకాలు తెలంగాణ వాతావరణానికి, ఇక్కడి వైవిధ్యభరితమైన నేలలకు అద్భుతంగా కుదురుతాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా) తక్కువ కాలపరిమితితో, తక్కువ నీటితో పండుతుంది. దీనికి షుగర్ ఫ్రీ (తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్) గుణాలు ఉండటంతో మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. అలాగే భౌగోళిక పరిస్థితులను తట్టుకునేలా వరంగల్, కూనారం పరిశోధనా స్థానాలు రూపొందించిన కూనారం సన్నాలు, సిద్ది రకాలు చీడపీడలను, ముఖ్యంగా అగ్గితెగులును సమర్థంగా తట్టుకుంటాయి.
ప్రభుత్వం ఏడు రకాలకే బోనస్ పరిమితం చేయడంతో, గతంలో సాగైన మిగిలిన రకాల భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు, ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బెల్టులో రైతులు దశాబ్దాలుగా ‘చిట్లు’ (చిట్టి ముత్యాలు) అనే స్థానిక సన్నరకాన్ని విరివిగా పండిస్తున్నారు. మార్కెట్‌లో దీనికి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ, పక్కాగా ధ్రువీకరించబడిన జన్యుపరమైన ఆధారాలు, సీడ్ సర్టిఫికేషన్ రికార్డులు లేకపోవడంతో దీనికి బోనస్ జాబితాలో చోటు దక్కలేదు. అలాగే కావేరి, జెయింట్ బీపీటీ, నెల్లూరు సన్నాలు వంటి ప్రైవేట్ రకాలకూ బోనస్ వర్తించదు. ఈ నిర్ణయం వల్ల రైతులు తమ అలవాటైన సంప్రదాయ స్థానిక రకాలను కాదని ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాబోయే వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.34 కోట్ల ఎకరాలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అంచనా వేయగా, అందులో 69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ వరి సాగులో సన్నాలకే పెద్దపీట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్దేశిత ఏడు సన్న రకాలను ఏకంగా 38.19 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని నిర్ణయించారు. గత సీజన్‌లో ఇవి 27.88 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈసారి నిరుటి కంటే 10.31 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని పెంచారు. ఈ మేరకు బోనస్ వర్తింపు, విస్తీర్ణం పెంపు తదితర అంశాలతో కూడిన నివేదికను మంత్రిమండలి ఆమోదానికి పంపారు.
సబ్సిడీ విత్తనాల కోసం ప్రభుత్వం సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రైతులు తాము కొనుగోలు చేసే విత్తనాలకు మొదట విక్రయ కేంద్రాలలో పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. పంట కాలం ముగిసే వరకు ఆ కొనుగోలు బిల్లులను ఎంతో భద్రంగా దాచుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ విస్తరణాధికారి (AEO) సదరు రైతు పొలాన్ని స్వయంగా సందర్శించి, కొనుగోలు చేసిన అధీకృత విత్తనాలనే సాగుకు ఉపయోగించారని ధ్రువీకరిస్తారు. ఏఈఓ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే, విత్తన సబ్సిడీ సొమ్ము నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది.
ప్రభుత్వం నిర్దేశించిన 38.19 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి మొత్తం 9.55 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు లెక్కగట్టారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో అవసరానికి మించి 15.64 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇందులో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద 38 వేల క్వింటాళ్లు, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ వద్ద 5 వేల క్వింటాళ్లు నిల్వ ఉండగా, మిగిలిన 15.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ప్రైవేటు కంపెనీల వద్ద అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విత్తనాల కొరత వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
విత్తనాల పంపిణీని పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆమోదంతో జిల్లా వ్యవసాయ అధికారి రైతు వేదికలను, విత్తన విక్రయ కేంద్రాలను గుర్తిస్తారు. ఆయా కేంద్రాలలో లభ్యమయ్యే విత్తనాల రకాలు, నిల్వల పరిమాణాన్ని ఏరోజుకారోజు బోర్డులపై ప్రదర్శించాలి. రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్‌లతో కేంద్రాలకు వస్తే.. 'రైతు భరోసా' సర్వర్ ద్వారా వివరాలను సరిచూసి అర్హత మేరకు విత్తనాలు విక్రయిస్తారు. ప్రైవేటు కంపెనీలు, డీలర్లు ఇష్టారాజ్యంగా ఇతర రకాల విత్తనాలను రైతులకు అంటగడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ ఏడు రకాల సన్న వరి విత్తనాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ఇచ్చే సబ్సిడీపై వ్యవసాయ శాఖ మూడు రకాల ఆర్థిక ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది.
రైతులకు 100 శాతం సబ్సిడీ ఇస్తే ప్రభుత్వంపై రూ.439.20 కోట్ల భారం పడుతుంది.
ఒకవేళ 50 శాతం సబ్సిడీ ఇస్తే రూ.219.60 కోట్లు ఖర్చవుతుంది.
ఒకవేళ 25 శాతం సబ్సిడీ కేటాయిస్తే రూ.109.80 కోట్ల ఆర్థిక భారం పడుతుందని అంచనా వేసింది. దీనిపై మంత్రిమండలి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.
Follow Us