Telangana : యుద్ధం ఎఫెక్ట్ :  మందుబాబులకు బిగ్ షాక్.. పెరగనున్న బీరు రేటు..!

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. అసలే ఎండకాలం పైగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.. ఇలాంటి టైమ్ లో చల్లని బీరు తాగి సేదతీరదామనుకునే వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

New Update
beer (1)

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. అసలే ఎండకాలం పైగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.. ఇలాంటి టైమ్ లో చల్లని బీరు తాగి సేదతీరదామనుకునే వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మద్యం, బీర్ల ధరలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ముడిసరుకుల ధరలు పెరగడం, గ్యాస్ కొరత వల్ల బాటిళ్ల ఉత్పత్తి పడిపోవడంతో మద్యం తయారీ కంపెనీలు ధరల పెంపు వైపు మొగ్గు చూపుతున్నాయి. మే నెల నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి మద్యం ధరలను ప్రభుత్వం సమీక్షిస్తుంది. చివరిసారిగా 2023 మే నెలలో ధరలను సవరించారు. నిబంధనల ప్రకారం 2025 మే నెలలోనే ధరలు పెరగాల్సి ఉన్నా, అప్పుడు వివిధ కారణాల వల్ల కంపెనీలు వెనక్కి తగ్గాయి. అయితే ఇప్పుడు ధరల సమీక్ష గడువు ముగిసి ఏడాది దాటిపోవడం, మరోవైపు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఈసారి పెంపు తప్పదని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మద్యం కంపెనీల ప్రతినిధులు ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి 12 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఒక జ్యుడీషియల్ కమిటీని కూడా నియమించింది.

ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం గ్యాస్ కొరత అని తెలుస్తోంది. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల వల్ల సహజ వాయువు సరఫరా దెబ్బతింది. గాజు సీసాల తయారీలో గ్యాస్ అత్యంత కీలకం. సరఫరా తగ్గడంతో దేశవ్యాప్తంగా గాజు సీసాల ఉత్పత్తి 40 శాతం వరకు పడిపోయింది. దీంతో ఖాళీ సీసాల ధరలు 20 శాతం మేర పెరిగాయి. ఈ భారాన్ని తాము భరించలేమని, అందుకే ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీలు వాపోతున్నాయి. బాటిళ్ల కొరత కారణంగా కంపెనీలు ఇప్పుడు క్యాన్ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, అల్యూమినియం ధరలు కూడా పెరగడంతో అక్కడ కూడా భారం తప్పడం లేదు.

ప్రతి సీసాపై రూ. 20 నుంచి రూ. 40 వరకు

ప్రస్తుతం మార్కెట్‌లో కింగ్ ఫిషర్ లైట్ బీరు రూ. 180, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ రూ. 190కి విక్రయిస్తున్నారు. ఇక ప్రీమియం బ్రాండ్లు అయిన బడ్ వైజర్ రూ. 230, బడ్ వైజర్ మాగ్నమ్ రూ. 250 పలుకుతున్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం, ప్రతి సీసాపై రూ. 20 నుంచి రూ. 40 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. వేసవిలో బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ పెంపు మందుబాబుల జేబులకు భారీగా చిల్లు పెట్టనుంది. అయితే "రేట్లు పెరిగినా... తగ్గేదేలే" అని కొందరు మందుబాబులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నా, సామాన్యులపై మాత్రం ఈ భారం ప్రభావం చూపనుంది. మే మొదటి వారంలో ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు