/rtv/media/media_files/2026/02/24/inter-exams-2026-02-24-20-00-29.jpg)
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా అమల్లో ఉన్న 'ఒక్క నిమిషం నిబంధన' విషయంలో కీలక సడలింపు ఇస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షల జరగనున్న నేపథ్యంలో అధికారులు నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు. ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించిన అధికారులు ఇదే తరహాలో మాల్ ప్రాక్టిసుకు తావులేకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
5 నిమిషాల గ్రేస్ పీరియడ్
పరీక్షా కేంద్రానికి విద్యార్థులు నిర్ణీత సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ సమస్యలు, రవాణా సౌకర్యాల ఇబ్బందుల వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందన్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 9:00 గంటల తర్వాత ఐదు నిమిషాలు (9:05) వరకు మాత్రమే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి పంపరు.
విద్యార్థులు తమ హాల్ టికెట్లను బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోటో లేదా సంతకం సరిగ్గా లేకపోతే ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సరిచేసుకోవాలి. ప్రశ్నపత్రాల లీకేజీకి ఆస్కారం లేకుండా ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు చెబుతోంది. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు పాల్పడితే మూడేళ్లపాటు డిబార్ చేస్తామని హెచ్చరిస్తు న్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెం టర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు 144 సెక్షన్ విధించనున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ బస్సులను నడపాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి సిబ్బంది పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం ఆదేశించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాలు సరైన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సిట్టింగ్ స్క్వాడ్ను నియమించి, ఎలాంటి సమ స్యలు తలెత్తకుండా చూడనున్నారు.
Follow Us