/rtv/media/media_files/2026/05/20/engineering-counseling-2026-05-20-19-08-31.jpg)
Engineering Counseling
Engineering Counseling : తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియపై అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు, ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న 'ఫీజు రీయింబర్స్‌మెంట్' వివాదమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది. సాధారణంగా ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్ - EAPCET) ఫలితాలు విడుదలైన వెంటనే కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా కాలంలో మినహా గత పదేళ్లుగా జూన్, జూలై నెలల్లోనే కౌన్సెలింగ్ పూర్తి చేసి, ఆగస్టు కల్లా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేవారు. ఇందుకోసం నెల రోజుల ముందే ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను సిద్ధం చేసేది.
కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఈఏపీసెట్ ఫలితాలు ఆదివారమే విడుదలయ్యాయి. పైగా ఈ ఏడాది నుండి ఆన్‌లైన్ పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు కంప్యూటర్ తెరపై కనిపించే సరికొత్త సాంకేతిక ఏర్పాట్లను కూడా ప్రవేశపెట్టారు. దీనివల్ల విద్యార్థులు తమ ర్యాంకులను వెంటనే తెలుసుకోగలిగారు. కట్-ఆఫ్ మార్కుల ఆధారంగా తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందో కూడా ఒక అంచనాకు వచ్చారు. ఇంతవరకు అంతా సజావుగానే సాగినప్పటికీ.. ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కోర్టు పరిధిలో ఫీజుల వివాదం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై గత ఏడాది కాలంగా న్యాయస్థానంలో తీవ్ర వివాదం నడుస్తోంది. పాత బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు, ప్రతి సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఇకపై ఫీజులను నిబంధనల ప్రకారం తప్పకుండా చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే, ఏ గడువులోగా ఈ నిధులను విడుదల చేస్తారనే దానిపై స్పష్టమైన కాలపరిమితిని (Timeline) మాత్రం ప్రభుత్వం పేర్కొనడం లేదు. ఈ పీటముడి ఇంకా న్యాయస్థానం ముందే ఉండటంతో అధికార యంత్రాంగం కౌన్సెలింగ్ తేదీల ప్రకటనపై వెనకడుగు వేస్తోంది.
ఖాతాల లంకెపై కాలేజీల తీవ్ర అభ్యంతరం
ఈ వివాదానికి తోడు, ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం మంటలు రేపుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును కాలేజీలకు కాకుండా నేరుగా విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానంపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు వేసే వరకు నిరీక్షిస్తే కాలేజీల నిర్వహణ, సిబ్బంది జీతాల చెల్లింపు కష్టమవుతుందని వాదిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం విద్యార్థి ఖాతాలో ఫీజు వేసినా.. వారు దానిని కాలేజీలకు సకాలంలో చెల్లించకుండా, ఇతర వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటే కాలేజీల పరిస్థితి ఏమిటని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.
విద్యార్థి సంఘాల ఆందోళన.. నిలిచిన షెడ్యూల్
మరోవైపు ఈ 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్' (DBT) విధానాన్ని విద్యార్థి సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం నుండి రీయింబర్స్‌మెంట్ రావడం ఆలస్యమైతే.. కాలేజీ యాజమాన్యాలు పరీక్షల సమయంలోనో, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అప్పుడో విద్యార్థులపై ఫీజులు కట్టాలంటూ ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలోనే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తేదీలను ఇప్పుడే ప్రకటించడం సరికాదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో, ఆర్థిక శాఖ వర్గాలతో చర్చించి ఫీజుల చెల్లింపుపై ఒక స్పష్టమైన పాలసీని ఖరారు చేసిన తర్వాతే షెడ్యూల్ ఇవ్వాలని నిర్ణయించారు. ఒకవేళ ఈ చర్చలు మరింత సుదీర్ఘంగా సాగితే, కౌన్సెలింగ్ ప్రక్రియ అనుకున్నదానికంటే చాలా ఆలస్యమై.. అకడమిక్ ఇయర్ దెబ్బతినే ప్రమాదముందని విద్యా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow Us