/rtv/media/media_files/2026/05/29/cm-revanth-2026-05-29-19-49-42.jpg)
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రకరకాల సంక్షేమ పథకాలను, సేవలను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపింది. ప్రజలకు అందుతున్న అన్ని డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, మరింత పారదర్శకతను పెంచేందుకు యూనిఫైడ్ స్మార్ట్ కార్డును తీసుకురావాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఒకే ఒక్క కార్డుకు అనుసంధానం
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ..ఒకే కార్డు–అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అనే నినాదంతో పక్కా కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డు, పెన్షన్, మహాలక్ష్మి వంటి పథకాలతో పాటు ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం వివరాలను ఈ ఒకే ఒక్క కార్డుకు అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు పొందడం చాలా సులువు అవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఈ కార్డు ప్రక్రియలో ప్రజల వ్యక్తిగత డేటా భద్రతకు, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు గట్టిగా సూచించారు.
ఈ సరికొత్త స్మార్ట్ కార్డు విధానాన్ని పక్కాగా అమలు చేయడానికి రాబోయే 10 రోజుల్లోగా పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను కోరారు. సంక్షేమ పథకాలే కాకుండా జనన, మరణ ధృవీకరణ పత్రాలు, పెన్షన్ డేటా, ప్రజల ఆరోగ్య ప్రొఫైల్ వంటి సమాచారాన్ని కూడా ఈ కార్డుతో లింక్ చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ విధానం వల్ల పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే కార్డుతో అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న బెస్ట్ స్మార్ట్ కార్డు విధానాలను కూడా అధ్యయనం చేయాలని సిఎస్ తెలిపారు.
Follow Us