BIG BREAKING: రచ్చకెక్కిన తెలంగాణ బీజేపీ నేతలు.. ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. ఆ నేత పనేనా?

మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని మేడ్చల్ వద్ద వెలసిన ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపాయి. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు బీజేపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

New Update
FotoJet (64)

Plexis against Etala Rajender

BIG BREAKING:  తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్యే కాకుండా అంతర్గత పరిణామాలు కూడా అప్పుడప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా, మల్కాజ్‌గిరి భారతీయ జనతా పార్టీ (BJP) పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని మేడ్చల్ వద్ద వెలసిన కొన్ని వివాదాస్పద ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపాయి. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు బీజేపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. "నీ ఏడుపే బీజేపీకి శాపం" అనే తీవ్రమైన శీర్షికతో వెలసిన ఈ ఫ్లెక్సీలు, పార్టీలోని అంతర్గత విభేదాలను వీధిన పడేసేలా ఉండటం గమనార్హం.

ఈ ఫ్లెక్సీలలో ఈటల రాజేందర్ వైఖరిని తప్పుబడుతూ పలు రకాల వ్యక్తిగత, రాజకీయ విమర్శలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా తన పేరు ప్రకటించలేదని, అలాగే కేంద్ర మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో ఈటల ఉన్నారంటూ అందులో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు, అక్కడ ఓడిపోయినప్పటికీ మల్కాజ్‌గిరి వంటి కీలకమైన ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది బీజేపీయేనని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ హవాలో గెలిచిన తర్వాత కూడా, "నా సొంత ఇమేజ్‌తోనే గెలిచాను" అని ఈటల రాజేందర్ అనడం ఏ రాజకీయ నైతికత అని ఆ ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నించారు.

అంతేకాకుండా, ఈ వివాదం ఇతర పార్టీ నేతల పేర్లను కూడా తెరపైకి తెచ్చింది. మరో బీసీ నాయకుడు ఎదుగుతుంటే అసహనం ఎందుకని, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపుమంట ఎందుకని ఆ బ్యానర్లలో నిలదీశారు. "నేను బీసీ నాయకుడిని.. నేనే ప్రత్యామ్నాయం" అనే భ్రమల నుంచి ఈటల రాజేందర్ బయటకు రావాలంటూ వ్యంగ్యంగా సూచించారు. అయితే, అసలు ఈ ఫ్లెక్సీలను అక్కడ ఎవరు ఏర్పాటు చేశారు, వాటి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే విషయాలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

ఈ ఉదంతంపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తక్షణమే స్పందిస్తూ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈటల రాజేందర్‌పై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని, అభ్యంతరకర బ్యానర్ల ఏర్పాటును ఆయన తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉంటూ, తెలంగాణ రాజకీయాల్లో ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఈటలపై ఇలాంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదన్నారు. ముఖ్యంగా, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు, తనకు మధ్య ఈటల రాజేందర్ గొడవలు పెడుతున్నారనే ప్రచారాన్ని నూటికి నూరు శాతం అబద్ధంగా కొట్టిపారేశారు. తమ మధ్య కేవలం సోదరభావం మాత్రమే ఉందని స్పష్టం చేస్తూ, రాజకీయాల్లో ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి తప్ప ఇలాంటి నీచమైన ప్రచారాలు చేయవద్దని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారు వెంటనే నిలిపివేయాలని అరవింద్ హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు