TGSRTC: ప్రాణం తీసిన ఆర్టీసీ సమ్మె....నర్సం పేటలో డ్రైవర్ ఆత్మహత్య

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. పలుచోట్ల ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్‌గౌడ్(55) పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

New Update
FotoJet - 2026-04-24T065735.975

RTC strike that took lives....driver commits suicide in Narsampet

TGSRTC: తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలుచోట్ల ఆందోళనలకు దిగిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపింది.వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్(55) గురువారం పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోగా శుక్రవారం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో నర్సంపేట డిపో వద్ద మధ్యాహ్నం నిరసన తెలుపుతున్న సమయంలో డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.80 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న శంకర్‌గౌడ్‌ను తొలుత నర్సంపేట ఆసుపత్రికి, ఆపై వరంగల్ MGMకు, చివరగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు.  

కాగా ఆయన  హైదరాబాద్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు దృవీకరించారు. శంకర్‌ గౌడ్‌ స్వస్థలం ఖానాపురం కాగా, గత 30 ఏళ్లుగా నర్సంపేటలో ఉంటున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కుమార్తె శ్యామిలి వేడుకుంటున్నారు.

 కాగా నిన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్‌గౌడ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శంకర్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. 

నేడు వరంగల్‌ బంద్‌
శంకర్‌గౌడ్ ఆత్మహత్యతో వరంగల్‌ భగ్గుమంది. శంకర్‌ గౌడ్‌ మృతికి  ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ, ఆర్టీసీ జేఏసీ (JAC) శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. శుక్రవారం కార్మికులు నర్సంపేట డిపో వద్ద ప్రైవేటు బస్సులను అడ్డుకుంటూ రాస్తారోకో నిర్వహించారు. కాగా ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

నల్లగొండలో మరో ఘటన

నల్లగొండ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మిర్యాలగూడ డిపోకు చెందిన డ్రైవర్ రావుల వెంకన్న, ప్రభుత్వం స్పందించడం లేదనే మనస్తాపంతో ధర్నా సమయంలో డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు, తోటి కార్మికులు వెంటనే అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

Advertisment
తాజా కథనాలు