/rtv/media/media_files/2026/04/26/ashu-reddy-case-2026-04-26-19-01-45.jpg)
Ashureddy case
Ashureddy : ప్రముఖ సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను సుమారు రూ. 10 కోట్ల మేర మోసం చేసిందన్న ఆరోపణలపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.
కేసు నేపథ్యం, ఆరోపణలు
లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే యువకుడిని వివాహం చేసుకుంటానని అషురెడ్డి నమ్మించినట్లు బాధితుడి తండ్రి సత్యనారాయణ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం.. పెళ్లి పేరుతో ధర్మేంద్ర నుంచి 5 కిలోల బంగారం, అలాగే ఉండటానికి ఫ్లాట్ కావాలని చెప్పి రూ. 3 కోట్ల విలువైన విల్లాకు అడ్వాన్స్ ఇప్పించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ. 9.83 కోట్ల విలువైన సొత్తును అషురెడ్డి కాజేసిందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది.ఈ పెళ్లి సంబంధం విషయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో జాతకాలు కూడా చూపించుకున్నారని, అన్నీ కుదిరాయని నమ్మించి ధర్మేంద్రను బుట్టలో వేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకసారి పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేక.. మళ్లీ పెళ్లి చేసుకుంటానని రెండోసారి కూడా నమ్మించి మోసం చేసినట్లు బాధితుడి తండ్రి వివరించారు.
హనీట్రాప్, బెదిరింపుల ఆరోపణలు
అషురెడ్డి తన బాయ్‌ఫ్రెండ్ జయంత్‌తో కలిసి ఈ పథకం పన్నిందని, వివిధ కారణాలు చెబుతూ తమ కుమారుడిని 'హనీట్రాప్' చేసిందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో అషురెడ్డి సోదరి దివ్యారెడ్డికి కూడా ప్రమేయం ఉందని, ఆమెకు కూడా ధర్మేంద్ర రూ. 50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా, ఇచ్చిన డబ్బులు, బంగారం తిరిగి ఇవ్వాలని అడిగిన ప్రతిసారీ అషురెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగేదని బాధితుడు ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని ఆయన పేర్కొన్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి చేస్తే, తిరిగి తనపైనే రివర్స్ కేసు పెడతానని ఆమె హెచ్చరించినట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు
ధర్మేంద్ర కుటుంబం రెండు నెలల క్రితమే పోలీసులను ఆశ్రయించగా, ప్రాథమిక విచారణ అనంతరం వారం రోజుల క్రితం పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. అషురెడ్డి, ఆమె సోదరి దివ్యారెడ్డి,ఇతర కుటుంబ సభ్యులపై బీఎన్ఎస్ 318(4) r/w 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు ఈ కేసును ఆర్థిక కోణంలోనూ, బెదిరింపుల కోణంలోనూ లోతుగా విచారిస్తున్నారు. ఇండియాలోనే కాకుండా యూకేలో కూడా ధర్మేంద్ర లోన్లు తీసుకున్నట్లు చెబుతుండటంతో ఆ లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
అషురెడ్డి స్పందన
తమపై వస్తున్న ఆరోపణలను అషురెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలని, పెళ్లి పేరుతో రూ. 9.83 కోట్లు కాజేశాననే వార్తల్లో నిజం లేదని ఆమె పేర్కొన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పోలీసుల దర్యాప్తు పూర్తి అయితేనే ఈ 'హనీట్రాప్','ఆర్థిక మోసం' కేసులో అసలు నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Follow Us