/rtv/media/media_files/2026/06/16/geological-survey-company-in-india-2026-06-16-16-22-27.jpg)
Geological Survey Company in India
Sangareddy : తెలంగాణ పారిశ్రామిక రంగానికి సరికొత్త జవసత్వాలునిచ్చేలా సంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిక్షేపాలు బయటపడ్డాయి. జిల్లాలోని మొగుడంపల్లి మండలం, రాయిపల్లి తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని పర్వతాపూర్ శివారులో ఈ అరుదైన నిక్షేపాలు ఉన్నట్లు కేంద్ర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడి సర్వే నంబర్ 5 నుండి 48 వరకు ఉన్న సుమారు 800 ఎకరాలకు పైగా ప్రభుత్వ, పట్టా భూముల్లో నిపుణులు పలుమార్లు క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి ఈ అన్వేషణను విజయవంతం చేశారు.
నిపుణుల తుది నివేదిక ప్రకారం, ఈ పర్వతాపూర్ బ్లాక్‌లోని మొత్తం 335.50 హెక్టార్ల విస్తీర్ణంలో అత్యంత విలువైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇందులో సుమారు 15.25 మిలియన్ టన్నుల వెనేడియం, అలాగే 87 మిలియన్ టన్నుల అల్యూమినస్ లేటరైట్, టైటానియం నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానానికి వెన్నెముకగా నిలిచే ఇటువంటి అరుదైన ఖనిజాలు తెలంగాణలో ఈ స్థాయిలో లభించడం ఒక మైలురాయిగా భావిస్తున్నారు. ఇక్కడ లభించే ఖనిజాలు దేశ రక్షణ, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులకు దోహదపడనున్నాయి.
వెనేడియం: దీనిని ప్రధానంగా స్టీల్ (ఉక్కు) తయారీలో నాణ్యతను, బలాన్ని పెంచేందుకు మిశ్రమ లోహంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, గ్రీన్ ఎనర్జీలో భాగమైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) బ్యాటరీలు,భారీ ఇంధన నిల్వ సామర్థ్యం గల గ్రిడ్ బ్యాటరీల తయారీలో ఇది ఎంతో కీలకం.
అల్యూమినస్ లేటరైట్, టైటానియం: ఈ నిక్షేపాలను డిఫెన్స్ (రక్షణ) రంగం, మిలిటరీ ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు (విమానాలు),అంతరిక్ష పరిశోధనల్లో వాడే రాకెట్ల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు.
ఈ ఖనిజ నిక్షేపాలను వేగంగా వెలికితీయడంతో పాటు ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ చొరవ చూపింది. ఇందులో భాగంగా ఇటీవల కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఒక ప్రత్యేక రోడ్‌షోను కూడా నిర్వహించారు. అనంతరం జూన్ 11న కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన అధికారిక గనుల వేలం పాటలో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (NLC India Limited) ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచి ఈ పర్వతాపూర్ గనుల తవ్వకపు హక్కులను దక్కించుకుంది.
జహీరాబాద్ పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ పర్వతాపూర్ బ్లాక్ ఉండడం పారిశ్రామికవేత్తలకు పెద్ద వరంగా మారనుంది. ఈ ప్రాంతానికి జాతీయ రహదారి 65 (NH-65) తో పాటు రైల్వే రవాణా మార్గాలు చాలా దగ్గరగా ఉన్నాయి. దీనివల్ల ఖనిజాల రవాణా, పరిశ్రమల స్థాపనకు అయ్యే వ్యయం గణనీయంగా తగ్గుతుందని, ఇది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతో అనుకూలమైన అంశమని కేంద్రం అంచనా వేస్తోంది.ఈ ఖనిజ నిక్షేపాల వెలికితీత మరియు స్థానికంగా అనుబంధ పరిశ్రమల స్థాపన ద్వారా సంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మైనింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఈ పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ రంగం కూడా వేగంగా పుంజుకోనుంది.
ఇప్పటికే హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల పరిధిలో 'నిమ్జ్' (NIMZ - నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) ప్రాజెక్టు, ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు వీటికి తోడు పర్వతాపూర్ ఖనిజ నిక్షేపాలు తోడవడంతో, రాబోయే రోజుల్లో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామిక ప్రగతికి, భారీ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా (ఇండస్ట్రియల్ హబ్‌గా) మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Follow Us