Ponguleti Harsha Reddy : పొంగులేటి హర్షారెడ్డి భూకబ్జా.. రూ.1400 కోట్ల విలువైన భూమిని లాక్కునే ప్రయత్నం

రాష్ట్ర మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో కేటీఆర్ సహా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించారు.

New Update
FotoJet (18)

Ponguleti Harsha Reddy : రాష్ట్ర మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో కేటీఆర్ సహా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించారు. పొంగులేటి తమ భూమిని కబ్జా చేశారని పేర్కొంటున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... వట్టినాగులపల్లిలో సతీష్ షా కుటుంబం 60 ఏళ్లుగా ఉంటుందని తెలిపారు. వారికి చెందిన రూ.1400 కోట్ల విలువ చేసే భూమిపై పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి కన్ను పడిందని పేర్కొన్నారు. స్థలం ఇచ్చే ఉద్దేశం లేదని షా కుటుంబం తెలిపినా వారిని బెదిరించి 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జేసీబీలతో వచ్చి గోశాలను కూల్చేశారని కాంపౌండ్ వాల్ కూలగొట్టారని అన్నారు. సతీష్ షాను ఇక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించారని తెలిపారు. అజీబుల్లా ఖాన్ అనే సిన్సియర్ అధికారి వీరికి రక్షణ కల్పించారని పేర్కొన్నారు. తెల్లారే ఆ నిజాయితీ పోలీసు అధికారిని ట్రాన్స్‌ఫర్ చేశారని చెప్పారు. సతీష్ షా వంటి ఎందరో బాధితులు ఇంకా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయని అన్నారు.

నేనే రాజు నేనే మంత్రి మా రాజ్యం అన్నట్టు పొంగులేటి కొడుకు హర్షారెడ్డి వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. ఇష్టమొచ్చినట్లు చేస్తామనేలా ధిక్కార ధోరణితో రాష్ట్రంలో గూండాగిరి రాజ్యం కొనసాగుతుందని మండిపడ్డారు. పొంగులేటి అక్రమాలపై సభాసంఘం వేయమని కోరుతున్నామని అన్నారు. సీబీసీఐడీ ఎంక్వైరీ వేసి పొంగులేటిని కాపాడాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. మంత్రి రాజీనామా చేస్తేనే సీబీసీఐడీ నిష్పక్షపాతంగా పనిచేస్తుందని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని తెలిపారు. తమ పేర్లు బయటపెట్టవద్దని బాధితులు కోరుతున్నారని పేర్కొన్నారు. పొంగులేటి బాధితుల పేర్లు బయటపెట్టకుండా బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా, న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు. త్వరలో భూకుంభకోణాలు, మైనింగ్ కుంభకోణాలను బయటపెడతామని హెచ్చరించారు. 

ధరణి పేరుతో దోపిడీ జరుగుతున్నదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోందని అన్నారు. కోటి ఎకరాల భూమి అక్రమంగా గుంజుకోవాలనే యత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి ఫ్యామిలీ అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుందన్నారు. ప్రజా దోపిడీని ప్రజా క్షేత్రంలోనే ఎండగడతామని అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలు అనేకం జరుగుతున్నాయని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికీ తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అనంతరం.. కేటీఆర్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు హర్షారెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న పొంగులేటిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అక్రమ మైనింగ్, భూ కబ్జాలకు పాల్పడుతున్న రాఘవ కన్‌స్ట్రక్షన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని గవర్నర్‌ను కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హిమాయత్ సాగర్, ఓఆర్ఆర్ పరిధిలో నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ తెలిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు