Bandi Sanjay : బండి కొడుకుపై పోక్సో కేసు... సంబురాలు చేసుకుంటున్నబీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒక పక్క కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కు సన్‌ స్ట్రోక్‌ తగిలి బాధపడుతుంటే మరోపక్క పార్టీలో కొందరు సీనియర్‌ నాయకులు ఫుల్‌హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.

New Update
bandi sanjay

Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పార్టీలో గ్రూపు రాజకీయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒక పక్క రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కు సన్‌ స్ట్రోక్‌ తగిలి బాధపడుతుంటే మరోపక్క పార్టీలో కొందరు సీనియర్‌ నాయకులు ఫుల్‌హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.  బండి సంజయ్‌ కొడుకు బండి భగీరథ్‌పై ఒక బాలికపై లైంగిక చర్యలకు పాల్పడ్డందుకుగాను హైదరాబాద్ పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేన్‌లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్‌ఎస్‌ ఇటు సోషల్‌మీడియాతో పాటు క్షేత్రస్థాయిలో పోరాటాలకు దిగింది. బండి కొడుకును అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్‌ చేసింది. ఒక పక్క ప్రధాని మోదీ హైదరాబాద్‌ టూర్‌ జరుగుతున్న సమయంలో రాజకీయంగా రేగిన దుమారం బండి సంజయ్‌కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. ప్రధాని సభలో మాట్లాడుతూ బండి  సంజయ్‌ తనపై కుట్రపై జరుగుతుందని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఇదంతా ఇలా ఉంటే దీనిలో అసలు రాజకీయ కోణం వేరే ఉన్నట్టు తెలుస్తోంది.

 కొడుకుపై పోక్సో కేసు నమోదై బండి చిక్కుల్లో పడ్డ వేళ తెలంగాణ బీజేపీలో కొందరు నేతలు ఫుల్‌ హ్యాపీగా ఉన్నట్టు సమాచారం. ఈ నేతల్లో పార్టీలో బండితో పడని  కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల, రఘునందన్‌, అర్వింద్‌ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి ప్రస్తుతం ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క పాయల్‌ శంకర్‌తో తప్ప అందరు బండికి దూరమేనని తెలుస్తోంది. బండి కొడుకుపై నమోదైన కేసుపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ఒక్కరు మాత్రమే ఇప్పటివరకు స్పందించారు. సంజయ్‌ కొడుకుపై పోక్సో కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.  రాంచందర్‌రావు తప్ప మిగిలిన వారెవరూ బండి కొడుకు కేసు వ్యవహారంపై స్పందించలేదు. అయితే లోలోపల మాత్రం బండి రైవల్ గ్రూపు నేతలు బండి దుస్థితి చూసి సంబరాలు చేసుకుంటున్నట్టు సమచారం. కొడుకు దెబ్బతో బండికి ఇక పార్టీలో రాజకీయంగా ఎలాంటి ఎదుగుదల ఉండదని వారు అంచనా వేస్తున్నారు. అవసరమైతే పార్టీ అధిష్టానం బండిని ప్రస్తుతమున్న కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా రాజీనామా చేయించే అవకాశాలు లేకపోలేదని అంతర్గత సంభాషణల్లో వారు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. 

గతంలో బండిసంజయ్‌ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా దూకుడుగా పనిచేశారు. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రాజీ లేకుండా పోరాటాలు చేశారు. బండి పార్టీ చీఫ్‌గా ఉన్నప్పుడు జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ కంటే బీజేపీ ఎక్కువ కార్పొరేటర్‌ సీట్లు గెలుచుకోవడం రాజకీయంగా సంచలనం రేపింది. ఆ తర్వాత జరిగిన ఒకటిరెండు పాపులర్‌ బై ఎలక్షన్స్‌లోనూ బీజేపీని గెలిపించేందుకు బండి గట్టిగా పోరాడారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం బండిని పార్టీ చీఫ్‌ పదవి నుంచి తప్పించారు. దీని వెనుక పార్టీలోనే కొందరు కుట్ర చేశారన్న ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. బండిని తప్పించిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయితే బండిని గనుక పార్టీ చీఫ్‌ పదవి నుంచి తప్పించి ఉండకపోతే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేదని ఆయన వర్గీయులతో పాటు కొందరు పొలిటికల్‌ అనలిస్టులు కూడా చెబుతుంటారు. పార్టీ అధ్యక్ష  పదవి నుంచి  తప్పించేందుకు కుట్ర చేశారని ఆరోపణలున్న సీనియర్‌ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఇప్పుడు కొడుకుపై కేసు వ్యవహారంతో బండి కష్టాల్లో పడడంతో సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం వీళ్లే కాకుండా సహచర ఎంపీలు ఈటల, రఘునందన్, ధర్మపురి అర్వింద్‌తో కూడా బండికి  అస్సలు పడడం లేదు. మరోసారి పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్‌లో ఉన్న వీళ్లకు  బండి పోటీ వస్తుండడంతో వీరి మధ్య రాజకీయంగా వైరం నెలకొంది. అయితే తాజాగా బండి కొడుకు కేసుతో చిక్కుల్లో పడడంతో ఆ సీనియర్ ఎంపీకూడా హ్యాపీగా ఉన్నట్టు సమాచారం. కొడుకు దెబ్బకు రాజకీయంగా బండి చాప్టర్‌ ఇక క్లోజేనని వీరంతా అనుకుంటున్నట్టు తెలుస్తోంది.    

బండిపై పార్టీలో ఎన్ని గ్రూపు రాజకీయాలు నడుస్తున్నప్పటికీ పార్టీ హైకమాండ్‌ అంత ఈజీగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోబోదని ఆయన వర్గీయులు ఆశాభావంతో ఉన్నారు. బండి కొడుకుపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేసింది. ఈలోగా బండి భగీరథ్‌ హైకోర్టులో తనపై నమోదైన తప్పుడు కేసు కొట్టేయాలని పిటిషన్‌ దాఖలు చేశాడు. తనపై ఆరోపణలు చేసిన అమ్మాయి తన వద్ద డబ్బులు వసూలు చేసేందుకు హానీట్రాప్‌ చేసిందని అది కుదరకే పోక్సో కేసు పెట్టిందని భగీరథ్‌ కరీంనగర్‌లో కౌంటర్‌ కేసు కూడా పెట్టాడు. ఈ రెండు కేసుల్లో ఏది నిలబడుతుందనేది తేలాల్సి ఉందని, హైకోర్టు బెయిల్‌ ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉందని బండి వర్గీయులు అంటున్నారు. ఒకవేళ హైకోర్టు బెయిల్‌ ఇస్తే మాత్రం బండికి పెద్ద ఊరట లభించినట్టేననేది వారి వాదన. బెయిల్‌ వస్తే విచారణ మొత్తం పూర్తై నిజానిజాలు కోర్టులో తేలేదాకా బండికి రాజకీయంగా ఎలాంటి ఢోకా ఉండదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క  తెలంగాణ పోలీసులు బండి భగీరథ్‌కు పోక్సో కేసు విషయంలో మంగళవారం నోటీసులు ఇచ్చారు. బుధవారం పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విచారణకు రావాలని కోరారు. ఈ విచారణకు భగీరథ్‌ హాజరవుతారా లేక హైకోర్టు తన బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు ఇచ్చేదాకా అజ్ఞాతంలోనే ఉంటారా అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. 

Advertisment
తాజా కథనాలు