/rtv/media/media_files/2025/04/29/pawan-kalyan-pahalgan-attack-11-730510.jpg)
తెలంగాణపై తనకు పూర్తి కమిట్‌మెంట్ ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్. కాబట్టే తన సొంత సంపాదన నుండి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ అభివృద్ధికి రూ.30 కోట్లు ఇచ్చానని తెలిపారు. ఇక్కడి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయల విరాళం ఇచ్చి ఆదుకున్నానని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. కొందరు నేతలు చేస్తున్న బెదిరింపులపై మండిపడుతూ.. "మమ్మల్ని బెదిరిస్తే భయపడేవాళ్లం కాదు. నాపై రాజకీయంగా తొలి కేసు నమోదైందే ఈ తెలంగాణ గడ్డపై! గతంలో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో మాపై దాడులు జరిగితేనే తట్టుకుని నిలబడ్డాం.. ఇప్పుడు మీ తాటాకు చప్పుళ్లకు భయపడతామా?" అని పవన్ అన్నారు.
ఇటీవల కాంగ్రెస్ నాయకులు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి నాలుక కొస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "కొందరు కాంగ్రెస్ నేతలు నా నాలుక కోస్తామని మాట్లాడుతున్నారు.. ఎవరొస్తారో రండి, నా నాలుక చూపిస్తా.. కోసుకోండి చూద్దాం!" అంటూ పవన్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇటువంటి బెదిరింపులకు జనసేన అస్సలు లొంగదని తేల్చిచెప్పారు.
వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం
రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తనను తెలంగాణకు వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ గడ్డకు ఎలాంటి అన్యాయం జరిగినా, ఇక్కడి ప్రజలకు కష్టం వచ్చినా.. అందరికంటే ముందు నిలబడి గళం విప్పేది, పోరాడేది కచ్చితంగా జనసేన పార్టీనే అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను తిప్పికొడుతూనే, తెలంగాణ ప్రజల గుండెల్లో జనసేనకు శాశ్వత స్థానం ఉందని ఆయన నొక్కిచెప్పారు.
Follow Us