పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తున్నారు. కేసు విచారణ కోసం ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రవీణ్ ప్రయాణించిన ఏరియాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రెండు బృందాలు విచారణ నిర్వహిస్తున్నాయి. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం మార్గంలో మరో 2 బృందాలు పరిశీలిస్తున్నాయి. 2 మార్గాల్లో సీసీటీవీ ఫుటేజీలు, కేసులో అనుమానం ఉన్న వ్యక్తులను ఆయా బృందాలు విచారణ చేస్తున్నాయి.
మరో వైపు హైదరాబాద్‌లో ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్ ను రికార్డు చేయనున్నారు. ఈ కేసును ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కేసు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు డీజీపీని అడిగి తెలుసుకుంటున్నారు.
ఎస్పీ కీలక ప్రకటన..
మరో వైపు ప్రవీణ్ మృతిపై తూర్పుగోదావరి ఎస్పీ కీలక ప్రకటన చేశారు. కేసు దర్యాప్తుపై వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్వేషాలు రగిల్చేలా, మతపరమైన అవాస్తవాలు ప్రచారం చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రవీణ్ మృతిపై ఆధారాలుంటే 9440796620 నంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
( pastor praveen news | telugu-news | latest-telugu-news | telugu breaking news)