/rtv/media/media_files/2025/04/15/IqFQv9aK8N4r3Le5D7nI.jpg)
cheyutha pensions
Pension :తెలంగాణ పింఛను దారులకు శుభవార్త. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ర్టంలోని పింఛనుదారులకు చేయూత పింఛనును పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల మూలంగా పింఛనును ఒకే సారి కాకుండా విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ రోగులు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రూ.2016 చొప్పున, దివ్యాంగులకు రూ.4016 చొప్పున పింఛను ఇస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాక పూర్వం కేవలం రూ.200 ఉన్న పింఛనును తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని మొదట రూ.1000 కి ఆ తర్వాత రూ.2016కు పెంచారు. అలాగే దివ్యాంగులకు రూ.1000 నుంచి రూ.2000 లకు ఆ తర్వాత రూ.4016లకు పెంచారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీల పేరుతో చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది.
ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని అమలు చేసింది. వాటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం వంటి హామీలను అమలులోకి తెచ్చింది. ఇక ఇప్పుడు పింఛన్ల పెంపుపై దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హౄమీ ఇచ్చిన ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు పేరుతో నేటికి పెంచలేదు. అయితే తాజాగా ఈ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అది కూడా ఒకే సారి కాకుండా విడతల వారిగా పెంచాలని సంకల్పించింది. అయితే దాన్ని వెంటనే అమలు చేయడమా లేదా కొంతకాలం ఆగాక నెరవేర్చడమా? అనే సందిగ్ధంలో పడింది. అయితే ఒకే సారి కాకుండా విడతల వారీగా పింఛను పెంచుతూ వెళ్లాలని అని ఉన్నత స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. విడతలవారీగా పెంచితే.. తొలి విడతలో రూ.500 పెంచాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
42.7 లక్షల మందికి ఊరట
కాగా తెలగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2024 లో సామాజిక సర్వే నిర్వహించింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 42.7 లక్షల మంది పింఛను దారులున్నారు. ఇందుకోసం ప్రతి నెలా రూ.950 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇక దీన్ని ప్రస్తుత ప్రభుత్వం రూ.500 చొప్పున పెంచితే.. నెలకు సుమారు రూ.210 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే ఏడాదికి ప్రభుత్వంపై రూ.2500 కోట్లకు పైగా భారం పడనుంది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగుల వేస్తోంది. దీనిపై తుది నిర్ణయానికి వచ్చాక బడ్జెట్లో కూడా ప్రస్తావించేందుకు కూడా సిద్ధమైంది. తొలి విడతలో పెంచాలని భావిస్తున్న మొత్తాన్ని కూడా కలిపి బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో దివ్యాంగుల పింఛను పొందేవారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారని, వీటి వరకు కొంత ఎక్కువ మొత్తం పెంచాలన్న విజ్ఞప్తులు ఆయా సంఘాల నుంచి వస్తున్నాయి. అయితే అందరికీ ఒకే విధంగా, సమ స్థాయిలోనే పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చేయూత ఫించన్లను ఇలా విడతల వారీగా పెంచుతూ ఎన్నికల నాటికి రూ.4 వేలు చెల్లించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారుల స్థాయిలో కూడా చర్చలు మొదలుకానట్టు సమాచారం. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాకే తమకు సమాచారం వస్తుందని అధికారులు అంటున్నారు.
Follow Us